Pa Ranjith: స్టంట్‌మ్యాన్ మృతిపై స్పందించిన పా రంజిత్!

Pa Ranjith: తమిళ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న ‘వేట్టువం’ చిత్ర షూటింగ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఓ సాహస సన్నివేశం చిత్రీకరణలో స్టంట్‌మ్యాన్ మోహన్ రాజు దురదృష్టవశాత్తూ మృతి చెందారు. ఈ ఘటనతో చిత్ర యూనిట్ షాక్‌లో ఉంది. దర్శకుడు పా రంజిత్ స్పందన ఏంటంటే…
నాగపట్టనంలోని విజుంతమవాడి గ్రామంలో ‘వేట్టువం’ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సాహస సన్నివేశంలో స్టంట్‌మ్యాన్ మోహన్ రాజు (52) ప్రమాదవశాత్తూ మరణించారు. కారు స్టంట్ సీక్వెన్స్‌లో ఎస్‌యూవీ ర్యాంప్‌పై నుంచి గాలిలోకి ఎగిరి, పల్టీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా, ఆయన తీవ్ర గాయాలతో మరణించారు.
దర్శకుడు పా రంజిత్ ఈ ఘటనపై స్పందిస్తూ, అన్ని భద్రతా చర్యలు పాటించినప్పటికీ ఈ విషాదం జరిగిందని, మోహన్ రాజు అసమాన ప్రతిభావంతుడని కొనియాడారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపిన రంజిత్, ఈ ఘటన తమను తీవ్ర ఆవేదనలో ముంచిందన్నారు. నీలం ప్రొడక్షన్స్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ జరుగుతోంది.