తెలంగాణ

కారు కొనాలంటే పార్కింగ్ ప్లేస్ ఉండాల్సిందే .. మహారాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం..

రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కారు కొనుగోలు చేయాలని ప్రకటించింది. పార్కింగ్‌ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనలను అమలులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్‌ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే.. పార్కింగ్ ప్లేస్ ఉన్నవారికి మాత్రమే కార్లు అమ్మాలని ఆయా ఆటో మోబైల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. త్వరలో ఈ నిబంధన అమల్లోకి రానుంది.

ముంబై సహా పలు నగరాల్లోని పలు అపార్ట్‌ మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం ఉండటం లేదు. తమ కార్లను రోడ్ల మీదే పార్క్ చేస్తున్నారు. దీని వల్ల జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రయాణీకులు గంటల తరబడి రోడ్ల మీద వేచి ఉండాల్సి వస్తున్నది. అంతేకాదు, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజిన్లు సహా పలు అత్యవసర సేవలు అందించే వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. వీటిని నివారించేందుకు కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్ కు సంబంధించి డాక్యుమెంట్స్ సమర్పించాలనే రూల్ తీసుకొచ్చినట్లు ప్రతాప సర్నాయక్ తెలిపారు.

అటు ట్రాఫిక్ ను అదుపు చేయడంతో పాటు, ప్రజలు ఇతర వాహనాల మీద ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో సేవలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను డెవలప్ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో కేబుల్ ట్యాక్స్ వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేండ్ర ఫడ్నవీస్ కీలక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడే ప్రైవేటు వాహనాలు తగ్గుతాయని భావిస్తున్నట్లు మంత్రి ప్రతాప సర్నాయక్ వెల్లడించారు.

కాగా… ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కలిపి పది వాహనాలు ఉంటున్నాయి. ఈ రోజుల్లో ఒక్కొకరికి ద్విచక్ర వాహనాలు, కార్లు తప్పకుండా ఉంటున్నాయి. అంతే కాకుండా వాళ్లు ఉంటున్న లోకల్‌గా కూడా తిరగాడానికి సపరేటుగా ఓ స్కూటీ లేదా ఇతర వాహనాలు తీసుకుంటున్నారు. ఇలా రోజురోజుకు వాహనాలు జోరుగా పెరుగుతున్నాయి. అధికంగా టూ వీలర్ బండ్లు పెరుగుతూ వస్తున్నాయి. పేదవాడి ఇంట్లో అందరికీ కలిపి ఒక టూ వీలర్ బండి ఉంటే, అదే కాస్తా డబ్బు ఉన్న వ్యక్తి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి టూ వీలర్ బండ్లు, అలాగే సపరేటుగా అన్ని కార్లు ఉంటున్నాయి.

ఇక ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం సోచిస్తున్నట్లు ప్రచారం. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వంటి సిటీలో రోడ్లకు ఇరువైపుల కార్లను నిలుపుతున్న వారిపైనా కొరడా ఝుళిపించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతున్నది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో కార్లను ఇండ్లల్లో పార్కింగ్ చేసేందుకు జాగా లేకపోవడంతో రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. పలు చోట్ల అక్రమ పార్కింగ్‌‌‌‌‌‌‌‌పై గొడవలు జరగడం, ఆ గొడవలు పెద్దవై పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ వరకు వెళ్తున్నాయి. కారు పార్కింగ్‌‌‌‌‌‌‌‌కు స్థలం లేకపోయినా.. వాటిని కొనడం, రోడ్లపై పార్కింగ్ చేస్తుండటంతో గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతోంది.

కారు కొనుగోలు చేసే వారు పార్కింగ్ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపిస్తేనే కారు కొనుగోలుకు అనుమతి ఇచ్చే విషయంపై కూడా రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంలో కార్ల షో రూమ్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులకు కూడా అవగాహన కల్పించే అంశంపై చర్చిస్తున్నారు. అదే సమయంలో పార్కింగ్ స్థలం ఉన్నట్టు సరైన ధ్రువీకరణ పత్రం ఉంటేనే కారు రిజిస్ట్రేషన్ చేయడంపైనా ఆలోచన చేస్తున్నారు. ఇది అమలైతే గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అక్రమ పార్కింగ్ బాధ తప్పినట్లేనని సిటీ జనం అంటున్నారు.

ఈ తాజా నిబంధనలకు సంబంధించి ప్రజల నుంచి విమర్శలు వచ్చినా.. వెనక్కి తగ్గబోమని
ఇక.. మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప సర్నాయక్ తెలిపారు. మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదన్న ఆయన.. దానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు తప్పవన్నారు. ఈ విధానం వల్ల అక్రమ పార్కింగ్‌‌‌‌‌‌‌‌కు చెక్ పెట్టేందుకు వీలు కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక.. ఈ విషయమే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోమంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే… ఈ ఆలోచన దిశగానే తెలంగాణ ప్రభుత్వం సైతం అడుగులు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక… చూడాలి ఆ ఆలోచన కార్యరూపం దాల్చుతుందో లేదో.. ? ప్రజల నుంచి ఎటువంటి విమర్శలు వస్తాయో..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button