ఆంధ్ర ప్రదేశ్

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి నో ఎంట్రీ

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జ్ మార్పు జరగనుందా..! ఆ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రికి ఇక వచ్చే అవకాశం లేదా..! ఏడాది కాలంగా తాడిపత్రిలో పార్టీని నమ్ముకుని ఉన్న కొందరు నాయకుల పేర్లను మాజీ సీఎం జగన్ పరిశీలిస్తున్నారా..! అదే జరిగితే తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు దక్కించుకునే నాయకులెవరు..? రూపాయి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భేటీ.. తాడిపత్రి నియోజకవర్గంలో చర్చకు తెరలేపింది.

రాష్ట్రంలోనే ఆ నియోజకవర్గం ఎప్పుడు సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తూ ఉంటుంది. అక్కడ జరిగే రాజకీయాలు రాష్ట్రంలో అనునిత్యం చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ ఓవైపు 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యేగా పదవి అలంకరించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోవైపుగా సాగుతున్న రాజకీయాలు ఇప్పటికీ రాష్ట్రంలో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం ఈ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తోంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇది మొదలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా చేశారు. తాడిపత్రిలోని సొంత ఇంటికి కూడా వచ్చే వీలు లేకుండా అష్టదిగ్బంధనం చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వచ్చే వీలు లేకపోవడంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొందట. తమ నాయకుడు ఎలాగైనా సరే తాడిపత్రి నియోజకవర్గంలోకి వచ్చి తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాడన్న నమ్మకం వైసీపీ శ్రేణుల్లో రోజు రోజుకూ సన్నగిల్లుతోందట.

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏడాది కాలంగా తాడిపత్రిలోకి అడుగు పెట్టకపోయినా తాడిపత్రిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధికారపక్షం తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారు.

అయితే పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉండాల్సిన నాయకుడు లేకపోవడంతో తాడిపత్రిలో వైఎస్ఆర్‌సీపీ కనుమరుగయ్యే ప్రమాదం నెలకొందట. దీన్ని గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తరచూ తాడిపత్రికి చెందిన కొందరు వైసీపీ నాయకులను తన వద్దకు పిలిపించుకుని తాడిపత్రి రాజకీయాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానీయకుండా అడ్డుకుంటున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సాగించిన అక్రమాలు, అన్యాయాలు, అకృత్యాలు అన్నీ ఇన్నీ కావన్నారు. తమ కుటుంబ సభ్యులపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టించడంతో పాటు తనను, తన కుమారుడు అస్మిత్ రెడ్డిని జైలుకు కూడా పంపారన్నారు.

సారీ జగన్ రెడ్డి.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానివ్వమన్నారు. ఏం చేస్తారు. మహా అయితే ఉరివేస్తారా అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈ పరిస్థితుల్లో తాడిపత్రి నియోజకవర్గ విషయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైపు మొగ్గుచూపితే అది పార్టీకే నష్టం చేకూరుతుందన్న సందేహంలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేదు.

తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైసీపీ క్యాడర్‌కు పార్టీకి చెందిన నాయకుల నుండి మద్దతు కరువైంది. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తాడిపత్రిలో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందన్న వాదన వినిపిస్తోంది. దీంతో తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్పు చేపట్టేందుకు జగన్ సుముఖంగా ఉన్నట్టు వైసీపీలో చర్చ జరుగుతోంది.

తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ మార్పు జరిగితే నెక్స్ట్ ఇన్‌చార్జ్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. పార్టీలో చురుకుగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ముస్లిం మైనార్టీ వర్గాల్లో మంచి పట్టున్న సీనియర్ నాయకులు హీరాపురం ఫయాజ్ భాష రూపాయి డాక్టర్ చామల వెంకట అనిల్‌ప్రసాద్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురిలో ఎవరో ఒకరికి తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తాడిపత్రిలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

పార్టీ ఇన్‌చార్జ్ విషయంలో రమేష్ రెడ్డి, ఫయాజ్ భాషతో పాటు రూపాయి డాక్టర్ అనిల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. రూపాయి డాక్టర్‌గా నియోజకవర్గంలో సుపరిచితుడైన డాక్టర్ అనిల్ రెడ్డి ఈ మధ్యనే వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. జిల్లా రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రూపాయి డాక్టర్ అనిల్ రెడ్డికి వెస్ట్ రాయలసీమ MLCగా పోటీ చేసి దాదాపుగా 25 శాతం ఓట్లు సాధించిన అనుభవం ఉంది.

పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందని తాడిపత్రి వైసీపీ నాయకులకు జగన్ మాట ఇచ్చారట. దీంతో తాడిపత్రి ఇన్‌చార్జ్ పదవి తమకే దక్కుతుందని ఆశావహులు భావిస్తున్నారట. తాడిపత్రి వైసీపీ ఇన్‌చార్జ్ మార్పుపై పార్టీలోని కొందరు నాయకులు బాహాటంగానే మాట్లాడుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మొత్తానికి కేతిరెడ్డి ఇష్యూతో తాడిపత్రిలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందట. మరి వైసీపీ అధినేత జగన్ తగిన నిర్ణయం తీసుకుని ఇన్‌చార్జ్‌ను మారుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button