ఆంధ్ర ప్రదేశ్
పుట్టిన శిశువును చెత్తకుప్పలో పడేసిన కసాయి తల్లి

కన్నప్రేమ కరువైంది మానవత్వం మంటగలిసింది. అప్పుడే పుట్టిన శిశువు అని కూడా చూడకుండా ఆ కన్నతల్లి అమానుషంగా ప్రవర్తించింది.
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది.గ్రామంలోని ఓ చెత్తకుప్పలో పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. దగ్గరికి వెళ్లి చూడగా రక్తపు ముద్దగా ఉన్న శిశువును చెత్తలో పడి ఉండటం చూసి చలించిపోయారు. వెంటనే స్థానిక ఆశా కార్యకర్తలకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఆశా కార్యకర్త, శిశువుకు ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



