China: బీజింగ్ పరేడ్‌లో రాకాసి అణు క్షిపణి

China: ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మని, భారత్‌తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. భారత ప్రధాని చైనా వెళ్లి వచ్చిన తర్వాత తన అమ్ముల పొదిలోని అత్యాధునిక భారీ అణు క్షిపణిని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఇంతకీ చైనా ఇలా చేయడానికి కారణమేంటి..? ప్రస్తుతం డ్రాగన్ వద్ద ఏ ఏ క్షిపణిలు ఉన్నాయి..?
చాలా దేశాలు తమ రక్షణ కోసం సైన్యానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. అమెరికా, రష్యా, చైనా, యూకే, జర్మని, ఫ్రాన్స్, భారత్‌తో సహా మరికొన్ని దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆఖరికి ఉత్తర కొరియాలో ఆకలి కేకలు ఉన్నప్పటికీ కూడా ఆ దేశం రక్షణ వ్యవస్థ కోసమే అధికంగా ఖర్చులు చేస్తోంది. అయితే ఇప్పుడు చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే వీటి సంఖ్య ఏకంగా 100 వరకు పెరిగినట్లు గుర్తించారు. తాజాగా చైనా తన అమ్ముల పొదిలోని అత్యాధునిక భారీ అణు క్షిపణిని ప్రపంచం ముందు ప్రదర్శించింది.
దీనిని డీఎఫ్-5సీగా వ్యవహరిస్తున్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. విక్టరీ డే మిలిటరీ పరేడ్‌లో ఈ క్షిపణి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సరికొత్త మిసైల్ రేంజిలోకి భూగోళం మొత్తం వస్తుంది. అంటే ప్రపంచంలో ఎక్కడున్న లక్ష్యాన్నైనా ఇది ధ్వంసం చేయగలదు. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని వెళ్లగలదని చెబుతున్నారు.
ఈ క్షిపణిని ఒక్క వాహనంపై తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీనిని మూడు భాగాలుగా తరలించి ఆ తర్వాత అసెంబ్లింగ్ చేసి ప్రయోగిస్తారు. గత డీఎఫ్-5 కన్నా డీఎఫ్-5సీని వేగంగా ప్రయోగానికి సిద్ధం చేయోచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే దీనిని భారీ సిలోస్ నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ మిసైల్ భూమి మొత్తం ప్రయాణించగలదు. దీని రేంజి 20,000 వేల కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. దీంతో చైనా ప్రతి దాడి సమయంలో శత్రువు ఎక్కడా అందకుండా దాక్కొనే అవకాశమే ఉండదు.
శత్రుదేశంలోని భూగర్భ స్థావరాలను కూడా ఇది ఛేదించగలదు. డీఎఫ్-5సీని ప్రయోగించే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. ఈ భారీ అణు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దాడి సమయంలో శబ్ధం కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగలదు. దీంతో ప్రస్తుతం ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలకు దీనిని ఎదుర్కోవడానికి అతి తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది.
డీఎఫ్-5సీలో ఎంఐఆర్‌వీ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్‌ను వాడారు. అంటే ఏకకాలంలో పలు అణు, సంప్రదాయ వార్‌హెడ్‌ల గగనతల రక్షణ వ్యవస్థలను మోసగించే డెకాయ్‌లను ఇది మోసుకెళ్లగలదు. వేర్వేరు లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేసేలా 10 వార్ హెడ్‌లను తీసుకెళ్లగలదని అంచనా వేస్తున్నారు నిపుణులు.
సాధారణంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణలకు అత్యంత కచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం ఉండదు వీటిల్లో ఇంటర్నల్ గైడెన్స్ సిస్టమ్, స్టార్‌లైట్ గైడెన్స్ టెక్నాలజీలను వాడుతుంటారు. కానీ డీఎఫ్-5సీలో మాత్రం చైనా అభివృద్ధి చేసిన బైడూ నేవిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీలను వాడారు. 20,000 కిలోమీటర్లు ప్రయాణించగలిగినా షార్ట్ మిసైల్స్ వలే అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా చెబుతోంది.
చైనా తొలిసారి ఎల్‌వై-1 లేజర్ వ్యవస్థను ప్రదర్శించింది. దీనిని టక్కుపై అమర్చి పరేడ్‌కు తీసుకొచ్చారు. వీటితోపాటు హైపవర్డ్ మైక్రోవేవ్ వ్యవస్థలను కూడా ప్రదర్శించింది. న్యూజనరేషన్ టైప్-100 ట్యాంక్‌లను ప్రదర్శించింది. గతలో టైప్ 99 ట్యాంక్‌ల కన్నా ఇవి అత్యాధునికమైనవి. ఇది సమన్వయం చేసుకొంటూ దాడులు చేయగలదు. డాంగ్‌ఫెంగ్-61 ఖండాంతర క్షిపణిని ప్రదర్శించింది.
దీని రేంజి 12,000 కిలోమీటర్లు. డీఎఫ్-41కు ఆధునిక వెర్షన్‌గా వెల్లడించింది. గగనతలం నుంచి ప్రయోగించే అణు క్షిపణి జేఎల్-1ను ఈ సారి పరేడ్‌లో తొలిసారిగా ప్రపంచం ముందుకు తెచ్చింది. గతంలో జలాంతర్గాముల నుంచి ప్రయోగించే జెఎల్-3ను వినియోగంలోకి తెచ్చింది. దీంతో చైనా న్యూక్లియర్ ట్రైయాడ్‌ను ఇది బలోపేతం చేసినట్లైంది.
ఏజేఎక్స్002 భారీ సముద్ర డ్రోన్‌ను ఈ సారి పరేడ్‌కు తీసుకొచ్చింది. సముద్రం లోతుల్లోకి చొచ్చుకొచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి వీలుగా దీనిని నిర్మించారు. హ-6జే లాంగ్ రేంజి బాంబర్ బీజింగ్ గగనతలంపై ఎగిరింది. దీనిని పీఎల్‌ఏ నేవీ కోసం రూపొందించారు. ఇది వైజే-12 యాంటీ షిప్ మిసైల్స్‌ను ప్రయోగించగలదు. కృత్రిమ మేధ సాయంతో దాడిచేసే డ్రోన్లను విక్టరీ డే సందర్భంగా చైనా ప్రదర్శించింది.
పీఎల్‌ఏ రాకెట్ ఫోర్స్ సరికొత్త డీఎఫ్-26డీ మధ్యశ్రేణి రేంజి బాలిస్టిక్ క్షిపణి తొలిసారిగా ఈ ప్రదర్శనకు వచ్చింది. జీజే-11 లాయల్ వింగ్‌మన్, సీజే-1000 హైపర్ సోనిక్ క్షిపణి, హెచ్‌క్యూ-20 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ , హైచ్‌క్యూ-29 యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, హెచ్‌క్యూ-11 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, చైనా హమార్స్‌గా పేరున్న పీహెచ్‌ఎల్-16 వంటి ఆయుధాలున్నాయి.
ఇదిలా ఉంటే పుతిన్, జిన్‌పింగ్, కిమ్ అమెరికాపై కుట్ర పన్నుతున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. చైనా సైనిక కవాతు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పక్షాన అమెరికా సైనికులు కూడా రక్తాన్ని చిందించారని ఈ సందర్భగా చైనా అధ్యక్షుడు గుర్తు చేసుకోవాలని ట్రంప్ హితవు పలికారు.
కాగా తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించారు. భారత్, చైనాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నాయి. భారత్‌పై భారీగా సుంకాలు విధిస్తూ చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్న అమెరికాకు చెక్ పెట్టేందుకు భారత్, చైనాలు దగ్గరవుతుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని పెంచుతోంది. ఇక భారత్‌పై చైనా మీడియా, సోషల్ మీడియా గతంలో అక్కసు వెళ్లగక్కగా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతోంది.
ఏడేళ్ల తరువాత చైనాలో పర్యటించారు మోదీ తియాజింగ్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ SCO వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. వీరిద్ధరి మధ్య ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై చర్చ జరిగింది. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ మొత్తం పరిస్థితిని చూస్తే ఆయుధ శక్తిలో అమెరికాతో చైనా పోటీపడుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాకాసి అణు క్షిపణిని ప్రయోగించి చైనా ఏం రుజువు చేయాలనుకుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



