మాజీ సీఎం జగన్ విమాన ప్రయాణాలపై లోకేష్ ఫైర్

మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా 222 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. దీనిపై లోకేశ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు.
500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు, 222 కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు. ఇన్నాళ్లకు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఓ దార్శనికత అవసరమైతే, జగన్ మాత్రం రాష్ట్రాన్ని విహారయాత్ర లా భావించారు” అంటూ లోకేశ్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవీకాలంలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుండి 222 కోట్లు డ్రా అయ్యాయని టీడీపీ ఆరోపిస్తుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. దీంతో చార్టర్డ్ హెలికాఫ్టర్ ప్రయాణాలపై ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. మంత్రి నారా లోకేష్ తరచుగా హైదరాబాద్‌కు విమాన ప్రయాణాలు చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించడంతో వివాదం మొదలైంది.



