కర్ణాటక మంత్రులు నారా లోకేష్ కౌంటర్

టీడీపీ యువనేత, ఏపీ కీలక మంత్రి నారా లోకేష్ కౌంటర్లకు కర్ణాటక మంత్రులు సమాధానాలివ్వక బొక్క బోర్లా పడుతున్నారు. ఓవైపు కర్నాటకను తలదన్నేలా ఏపీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే మరోవైపు స్థానిక పారిశ్రామికవేత్తలు, ప్రజలు నుంచి వస్తున్న వ్యతిరేకత కర్నాటక మంత్రులకు నిద్ర కరువు చేస్తోంది. ఓవైపు కర్నాటకలో ఫెసిలిటీస్ సరిగా లేకుంటే వారు ఏపీకి రావొచ్చని నారా లోకేశ్ వెల్కమ్ పలుకుతుంటే మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయకుంటే దుకాణం బంద్ చేస్తామంటూ బెంగళూరు కేంద్రంగా వ్యాపారులు తేల్చి చెబుతున్నారు.
ఇండియా ఐటీ కేపిటల్ బెంగళూరులో మౌలిక సదుపాయాల దుస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ఆంధ్ర ఆహారం కారంగా ఉంటుందంటారు. మా పెట్టుబడులూ అలాగే కారంగా ఉన్నాయేమో! కొంత మంది పొరుగువారు ఇప్పటికే మంటలను ఆస్వాదిస్తున్నారని లోకేష్ చేసిన ట్వీట్ కర్నాటక రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయ వేడి రేపుతోంది.
ఈ మొత్తం వ్యవహారం హాట్ హాట్ కావడానికి అసలు కారణం బెంగళూరులోని బెల్లందూర్ ప్రాంతానికి చెందిన లాజిస్టిక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యాబాజీ చేసిన పోస్ట్. నగరంలోని రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ సమస్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. దీనిపై లోకేష్ వెంటనే స్పందించి, వైజాగ్‌కి రండి, మేము మౌలిక సదుపాయాల పరంగా మెరుగ్గా ఉన్నామని సదరు కంపెనీకి ఆహ్వానం పలికారు. ఈ వ్యాఖ్య కర్ణాటక రాజకీయ నేతలకు మంట పుట్టించింది.
ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐటి మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇద్దరూ లోకేష్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఏపీగానీ వైజాగ్‌గానీ, కర్నాటక బెంగళూరుతో పోటీ పడలేవన్నారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్, మానవ వనరుల పరంగా తాము ముందున్నామని డీకే శివకుమార్ అన్నారు. అయితే లోకేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 120 బిలియన్ల డాలర్లను పెట్టుబడులను ఆకర్షించిందన్నారు.
గూగుల్ ఏపీలో కొత్త డేటా, AI హబ్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందన్నారు. తాము వేగంగా సంస్కరణలు తీసుకువస్తున్నామన్న ఆయన ఇది ఎవరికైనా ఆందోళన కలిగిస్తే దానికి తామేం చేయలేమన్నారు. ఏపీ ఇప్పుడు అలాంటి వారికి ఒక సవాల్ విసురుతుందన్నారు. ఆంధ్ర ప్రభుత్వం పెట్టుబడులు రప్పించడానికి పర్యావరణ నిబంధనలను బలహీనపరుస్తోందని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శించారు.
దీనికి ఐటీ మంత్రి లోకేష్ ఘాటుగా సమాధానమిచ్చారు. కర్నాటక నాయకులకు తమ సొంత పరిశ్రమలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యుత్ కోతలు, చెత్త సమస్యలు, రోడ్ల దుస్థితిని ముందుగా పరిష్కరించాలని హితవు పలికారు. ఇక గూగుల్ పెట్టుబడి నిర్ణయం ఈ పోటీకి మరింత కారణమవుతోందన్నది నిర్వివాదాంశం. కర్నాటకతో పోల్చినప్పుడు గూగూల్ ఏపీలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
పన్ను రాయితీలు, యుటిలిటీ మినహాయింపులు కలిపి 22 వేల కోట్ల ఉచితాలు ఇచ్చి పెట్టుబడులు రప్పించడమేనంటూ ఖర్గే విమర్శించగా అందుకు నారా లోకేష్ సైతం ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏపీ తనకున్న సామర్థ్యాన్ని చూపించి, పరిశ్రమలు ఆకర్షిస్తోందని, తద్వారా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఓవైపు కర్నాటక మంత్రులు, ఏపీ మంత్రి నారా లోకేష్‌కు కౌంటర్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుంటే.. మరోవైపు బయోకాన్ అధిపతి కిరణ్ మజుందార్-షా కర్నాటక ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.
మొత్తానికి వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. బెంగళూరులో రోడ్లు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయని ఆమె, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెత్త ఎందుకు అంతగా ఉందన్న ఆమె, ప్రభుత్వం పెట్టుబడులకు మద్దతు ఇవ్వదా అంటూ ఆమె మండిపడ్డారు. కర్నాటక పౌరులు కొందరు, ఇంకో అడుగు ముందుకేసి, మౌలిక సదుపాయాలు కల్పించకుంటే, ఆస్తి పన్ను చెల్లించమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.
ఇది మొత్తం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. మొత్తంగా బెంగళూరు వర్సెస్ వైజాగ్ పోటీ కొత్త దశలోకి వెళ్తోంది. ఓవైపు మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా, రోడ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు, మరోవైపు పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకుపోతున్న వైజాగ్ ఇప్పుడు దేశ ఐటీ రంగానికి కొత్త పోటీ కేంద్రాలుగా మారుతున్నాయి. లోకేష్ వ్యాఖ్యలతో ఈ పోటీ ఇప్పుడు కేవలం ఆర్థిక సమరమే కాదు, రాజకీయ ప్రతిష్ట పోరాటంగా మారింది.



