నగరిలో వేడెక్కిన రాజకీయం.. రోజా వర్సెస్ గాలి భాను ప్రకాష్

చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. హద్దులు దాటి పరస్పరం దూషించుకోవడం నియోజకవర్గంలో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఇరువురు నేతల మధ్య ఏం జరిగింది. ప్రస్తుత వివాదానికి కారణం ఏమిటి…
చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం వాడి వేడి రాజకీయాలకు పెట్టింది పేరు. రోజా రాకతో ఈ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. ప్రత్యర్థులపై పరుష పదజాలంతో విరుచుకుపడే రోజా ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే దూకుడుతో నియోజకవర్గంలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. టీడీపీని వీడి వైసీపీలోకి రోజా అడుగుపెట్టాక రోజా వర్సెస్ గాలి ముద్దుకృష్ణమ నాయుడిగా పోరు కొనసాగింది.
ముద్దుకృష్ణమ నాయుడు మరణం అనంతరం ఆయన కుమారుడు టీడీపీ ఇన్‌చార్జ్ అయ్యాక.. రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్‌గా సీన్ మారింది. నగరిలో 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా విజయం సాధించిన రోజా 2024లో ఓడిపోయారు. 2019లో రోజా చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్ధి గాలి బానుప్రకాష్ 2024లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అయితే నగరిలో దారుణ పరాజయం పాలైనా రోజా మాత్రం తగ్గేదే లేదని అంటున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా అదే దూకుడును కొనసాగిస్తున్నారు.
తాజాగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, మాజీ మంత్రి రోజా మధ్య మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఓ బహిరంగ సభలో గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోజా భారీ అవినీతి చేశారని ఆరోపించారు. రెండు వేలిస్తే చాలు రోజా ఏ పనైనా చేస్తుందని ఆమె హీరోయిన్‌కు తక్కువ వ్యాంప్ క్యారెక్టర్‌కు ఎక్కువ అంటూ భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు దుపారం రేపాయి. దీనిపై ఘాటుగా స్పందించిన రోజా గాలి భానుప్రకాష్‌పై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.
భానుప్రకాష్ గాలోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరి ఎమ్మెల్యే గాల్లో గెలిచిన గాలోడు అని రాబోయే ఎన్నికల్లో గాలికి కొట్టుకుపోతాడంటూ కామెంట్ చేశారు. భానుప్రకాష్‌ను వాడు వీడు అంటూ దుర్భాషలాడారు. ఇదే సమయంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడంతో రోజా మరింత మండిపడ్డారు. లారీలతో ఇష్టానుసారంగా ఇసుకను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అనుచరులు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో గాలి భాను ప్రకాష్ కూడా రోజాకు బహిరంగ సవాల్ విసిరారు.
తన మీద చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. రోజాకు దమ్ముంటే కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు. టైం తాను చెప్పమన్నా సరే లేదా రోజా చెప్పిన సరే వస్తానని సవాల్ విసిరారు. ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో రోజాతో పాటు ఆమె అన్నదమ్ములు, అనుచరులు అవినీతి చేశారని ఆరోపించారు. రోజా వ్యవహారం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగిరి వచ్చినపుడు 12 వేలకు అద్దె ఇల్లు తీసుకున్న రోజా ఇప్పుడు హైదరాబాద్, నగరి, చెన్న ఊరుకో ఇల్లు కడుతుందని అన్నారు. ఇలా ఇరువురు నేతలు హద్దులు దాటి వ్యక్తిగత ఆరోపణలకు వెళ్లడంతో నగరి రాజకీయాలు హీటెక్కా యి.
భాను ప్రకాష్ తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై కేసు పెట్టాలంటూ కోరారు. పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసిన రోజా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భాను ప్రకాష్‌ను ఇంట్లో తల్లి, ఇతర కుటుంబ సభ్యులు దూరం పెట్టారని వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.
ఇలా నగరిలో మళ్లీ వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పతాక స్థాయికి చేరుకున్నాయి. నగరిలో ఓడిపోయాక కొన్ని రోజులపాటు సైలెంట్‌గా ఉన్న రోజా మళ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓ దశలో నగరి వైసీపీ ఇంచార్జ్‌గా భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్‌ను నియమిస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రోజా ప్లేస్‌లో జగదీష్‌ను దింపుతున్నారంటూ చర్చ జరిగింది. అయితే ఈ అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ రోజాకు భరోసా ఇచ్చినట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు.
మొత్తం మీద నగరి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. మరి టీడీపీ, వైసీపీ మధ్య చెలరేగిన మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో.. వేచి చూడాలి.