తెలంగాణలో ముదురుతున్న మార్వాడి గో బ్యాక్ వివాదం

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ వివాదం ముదురుతోంది. తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది. 10 రోజుల క్రితం మార్వాడీ వివాదం మొదలైంది. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడీ వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్వాడీల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారినే పనిలో పెట్టుకుంటున్నారని వాళ్లు అంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్వాడీలకు వ్యతిరేకంగా పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. మార్వాడీ గో బ్యాక్ అంటూ జిల్లా వ్యాప్తంగా జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తూ తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
చిరు వ్యాపారుల బ్రతుకులో చీకటి నింపిన మా ర్వాడిలను ఉస్మానియా జేఏసీ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బందు విజయవంతంగా కొనసాగుతుందని జేఏసీ కమిటీ నాయకులు తెలిపారు. మార్వాడీలు తెలంగాణకు వచ్చి చిరు వ్యాపారుల నోట్లో మట్టి కొడుతున్నారని జేఏసీ నాయకులు అన్నారు.
మార్వాడి హటావో తెలంగాణ బచావో అని నినాదంతో దుబ్బాక బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ బంద్‌కు వర్తక వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తున్నాయని తెలిపారు.ఈ బంద్‌తో మార్వాడీల పెత్తనంపై ఉక్కు పాదంమోపాలని అన్నారు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో మార్వాడీ గో బ్యాక్ వివాదం ముదురుతుంది. ఆమనగల్ పట్టణంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. మార్వాడీల వ్యాపారంతో తెలంగాణ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్వాడి వ్యాపారస్తుల తీరుతో తెలంగాణ వ్యాపారులు ఆర్థికంగా చితికి పోతున్నారని ఇక్కడి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని జేఏసీ నాయకులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో మార్వాడీలు గో బ్యాక్ అంటూ వ్యతిరేకంగా సెల్‌ఫోన్ దుకాణదారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీ నిర్వహించిన వారిని తహశీల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు.



