Mark Carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణం

Mark Carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాతో టారిఫ్ వార్ వంటి సవాళ్ల నేపథ్యంలో 24వ ప్రధానిగా కార్నీ బాధ్యతలు స్వీకరించారు. కెనడా గవర్నర్ జనరల్ సమక్షంలో కార్నీ నూతన ప్రధానిగా ప్రమాణం చేశారు.
పీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీకి కొత్త సారథి ఎన్నిక తప్పలేదు. ఈ క్రమంలో పార్టీలో జరిగిన ఎన్నికల్లో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లకు గతంలో గవర్నర్‌గా పనిచేసిన కార్నీ ఘన విజయం సాధించారు. అమెరికా-కెనడా సంబంధాలు దెబ్బతింటున్న సమయంలో కార్నీ బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫోర్ట్ స్మిత్‌లో 1965లో జన్మించిన మార్క్ కార్నీ హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్‌మన్ శాక్స్‌తో ప్రయాణం ప్రారంభించి.. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా పనిచేశారు. 2008-09 ఆర్థిక సంక్షోభం వేళ పరిష్కార మార్గాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.



