Nobel Peace Prize 2025: మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Nobel Peace Prize 2025: 2025 నోబెల్ శాంతి బహుమతిపై ఎట్టకేలకు టెన్షన్ వీడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి 2025పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ పురస్కారం కోసం ప్రపంచం ఈ సారి మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ శాంతి బహుమతి 2025పై ప్రకటన చేసింది. నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మారియా కొరీనా మచాడోకు అందజేయాలని నిర్ణయించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత మార్పు సాధించేందుకు ఆమె చేసిన పోరాటాన్ని గౌరవిస్తూ ఈ బహుమతి ప్రకటించారు. ఈ మేరకు ది నోబెల్ ప్రైజ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బహుమతిని డిసెంబర్ 10, 2025న నార్వేలోని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.
మరియా కొరినా మచాడో 2025 నోబెల్ శాంతి బహుమతి పొందిన ఈమె వెనిజులా దేశం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత మార్పు తీసుకురావటంలో సైన్యం పాలనకు వ్యతిరేకంగా ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారామె. 2024 నుంచి ఆమె అజ్ణాత జీవితంలో ఉన్నారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వెనిజుల ప్రజల కోసం దేశంలోనే ఉంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.
వెనిజుల దేశ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకంగా చేయటంలో ఒక్క తాటిపైకి తీసుకురావటంలో మరియా మచాడో చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్లు కమిటీ స్పష్టం చేసింది. సైన్యానికి వ్యతిరేకంగా గళం విప్పటంలో పోరాటం చేయటంలో ఆమె ఎప్పుడూ శాంతి మార్గాన్నే ఎంచుకున్నారు. ఏ దశలోనూ హింసాత్మక దోరణిని సమర్థించలేదు. ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేశారు మచాడో.
ఇక. అణు శక్తులైన భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపాను. ప్రపంచ వ్యాప్తంగా ఏడెనిమిది యుద్ధాలను ఆపేశాను.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడాను. నాకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందేనంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చాటింపు వేసుకున్నారు. పాకిస్థాన్‌తోపాటు ఇజ్రాయెల్‌తోనూ తన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి సిఫారసు చేయించుకున్నారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, కంబోడియా ప్రధాని హున్ మానెట్, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బడ్డీ కార్టర్‌తో పాటు స్వీడన్, నార్వే ఎంపీలు ట్రంప్‌ను నామినేట్ చేశారు.
మరోవైపు నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేయగలిగారు. అక్టోబర్ 5 డెడ్ లైన్ పెట్టి మరీ అటు నెతన్యాహూ, ఇటు హమాస్‌ను తనదైన శైలిలో దారికి తెచ్చుకొని మరీ ఈ డీల్ కుదిర్చారు. దేవుడి ఆశీర్వాదంతో శాంతిని తీసుకొచ్చాను అంటూ ట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో ఇక శాంతి వర్ధిల్లుతుందని గొప్పలు చెప్పుకున్నారు. మావోడు పీస్ ప్రెసిడెంట్ అంటూ వైట్ హౌస్ డబ్బా కొట్టింది.
ఇంత చేసినా ట్రంప్ కోరిక నెరవేరలేదు. నోబెల్ శాంతి బహుమానం ఆయన్ను వరించలేదు. వేలాది ఏళ్లపాటు కాకపోయినా దశాబ్దాల తరబడి సాగే అవకాశం ఉన్న యుద్ధాలను తాను ఆపానని మిలియన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను కాపాడానంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్ విశ్వసించలేదు. దౌత్య మార్గంతోపాటు టారిఫ్‌లు విధిస్తామని బెదిరించి, సైన్యాన్ని రంగంలోకి దింపుతామని హెచ్చరించి యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు.
ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత జూన్ నెలలో డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్థాన్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసింది. ఆ తర్వాత జులై నెలలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆ పని చేశారు. దక్షిణాసియాలో స్థిరత్వం కోసం ట్రంప్ కృషి చేశారని పాక్ చెబితే పశ్చిమాసియాలో ట్రంప్ దౌత్యాన్ని నెతన్యాహూ కొనియాడారు. థాయ్‌లాండ్-కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి చేసిన కృషికిగానూ కాంబోడియా ప్రధాని హన్ మానెట్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ఆగస్టులో నామినేట్ చేశారు.
అయితే ట్రంప్‌కు 2025లో నోబెల్ బహుమతి రాకపోవడానికి అతిపెద్ద కారణం నోబెల్ శాంతి పురస్కారానికి నామినేషన్ల గడువు ఈ ఏడాది జనవరి 31న ముగియడమే. అంటే ట్రంప్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే నామినేషన్ల ప్రక్రియ క్లోజ్ అయ్యింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన నామినేషన్లను వచ్చే ఏడాదికి పరిశీలనలోకి తీసుకుంటారు.
అంటే ట్రంప్ కోసం వేసిన నామినేషన్లను నోబెల్ కమిటీ 2026 కోసం పరిశీలిస్తుంది. అయితే, జనవరి 31 గడువు లోగా డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసిన వారు కూడా ఉన్నారు. అబ్రహాం అకార్డ్స్ కారణంగా రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఒకరు ట్రంప్‌ను నామినేట్ చేశారు. ఈ నామినేషన్‌ను నోబెల్ కమిటీ ఈ ఏడాది పరిశీలించింది.
కాగా 2025 నోబెల్ శాంతి బహుమతి కోసం మొత్తం 338 అభ్యర్థనలు వచ్చాయి. ఇందులో 244 మంది వ్యక్తులు కాగా 94 సంస్థలు నామినేట్ అయినట్టు నార్వేకు చెందిన నోబెల్ కమిటీ ధ్రువీకరించింది. నోబెల్ కమిటీ సంప్రదాయం ప్రకారం నామినీల వివరాలను 50 ఏళ్ల పాటు గోప్యంగా ఉంచుతారు. కానీ, చాలా నామినీలు వాటిని సమర్పించిన వ్యక్తులు, లేదంటే సంస్థల నుంచి బహిర్గతం అవుతుంటాయి. ఇలాంటి వ్యక్తే డానాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమింటంటే అసలు నోబెల్ శాంతి బహుమతిని ఎలా ప్రదానం చేస్తారని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గౌరవప్రదమైన పురస్కారాల్లో ఒకటి నోబెల్ శాంతి బహుమతి.
స్వీడన్ పారిశ్రామికవేత్త అల్ఫ్రైడ్ నోబెల్ వీలునామా ప్రకారం నోబెల్ పురస్కారాలను ప్రదానం చేస్తారు. దేశాల మధ్య సోదర భావాన్ని పెంపొందించడం సైనిక ఘర్షణలను నిలిపేయడం, శాంతి సమావేశాలు నిర్వహించడం శాంతి వ్యాప్తికి కృషి చేసిన అత్యుత్తమమైన వ్యక్తులకు, సంస్థలకు నోబెల్ శాంతి బహుమతిని అందజేస్తారు. నార్వేజియన్ పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ శాంతి పురస్కారానికి నామినీలను స్వీకరిస్తుంది. నామినేషన్ గడువు ముగిసిన తరువాత అభ్యర్థుల జాబితాను కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ తరువాత.. కమిటీ సభ్యులు, బయటి నిపుణులతో పరిశీలన చేయిస్తారు. మెజార్టీ ఓటుతో పురస్కారం ప్రధానంపై తుది నిర్ణయం తీసుకుంటారు.
మరోవైపు ఎవరైనా నోబెల్ శాంతి నామినేషన్ గురించి పదే పదే చెప్పుకుంటే దాన్ని లాబియింగ్ కోసం యత్నించినట్టు భావించి సదరు నామినేషన్లను కమిటి తిరస్కరించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రచారాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజే చెబుతున్నారు. సో, ఓవరాల్‌గా ట్రంప్ ఎంత ప్రయత్నాలు చేసినా శాంతి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నా ఈ ఏడాది నోబెల్ మాత్రం దక్కలేదు. 2026లో కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తే తప్ప ట్రంప్‌కు నోబెల్ శాంతి దక్కకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



