Weather Report: ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు.. రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు

Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతారణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే ఐదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి, దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది.
రాబోయే ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని సముద్రం అల్లకల్లోలంగా మారడంతో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. ఈ వర్షాలు, గాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండరాదని ప్రజలకు సూచించారు.



