Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు

Kodali Nani: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్ ద్వారా LOC కూడా జారీ చేశారు. ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కొడాలి ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ముంబైలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నాని పాస్‌పోర్టును సీజ్ చేయాలని కనపర్తి కోరారు.