London: వలసలకు వ్యతిరేకంగా లండన్లో భారీ నిరసనలు

London: నేపాల్ అయిపోయింది, ప్రాన్స్ చల్లబడింది ఇప్పుడు లండన్ వంతు వచ్చింది. అయితే ఇక్కడ సమస్య వేరు ఇతర దేశాల్లో ఆయా ప్రభుత్వాలపై జనంలో ఆగ్రహా జ్వాలలు రగులుతుండగా.. ది గ్రేట్ యునైటెడ్ కింగ్ డమ్ గా చెప్పుకునే యూకేలో మాత్రం ఇతర దేశస్తులపై ద్వేషంతో జనం రగులుతున్నారు. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తమ ఉద్యోగాలను లాగేస్తున్నారంటూ రోడ్డెక్కారు.
యూకే వీధులు నిరసనలతో మారుమోగిపోయాయి. లక్షలాది మంది హాజరుకావడంతో లండన్ వీధులు జనసంద్రంగా మారాయి. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి రాజకీయ పార్టీలు ప్రజలను ఎగదోసి లబ్ధి పొందుతున్నాయి. ఇంతకీ లండన్లో లడాయి సృష్టించిందెవరు..? దీని వళ్ల భారతీయులకు సందేశం ఏమిటి..? నిరసనల వెనుకున్న అసలు కథేంటి..?
అమెరికా, పశ్చిమదేశాల్లో ఇటీవల కాలంలో వలసలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకొని అక్కడి రాజకీయ పార్టీలు ప్రజలను ఎగదోసి లబ్ధి పొందుతున్నాయి. దీనిని అమెరికాలోని రిపబ్లికన్ల విషయంలో స్పష్టంగా చూడొచ్చు. ఇటీవల కాలంలో జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇలా కీలక ఐరోపా దేశాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా యూకేలో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన వలస వ్యతిరేక ఆందోళనలు కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపింది. దీనికి ఏకంగా లక్ష మంది హాజరుకావడంతో లండన్ వీధులు జనసంద్రంగా మారాయి.
ఇంగ్లాండ్ సంస్కృతి, గుర్తింపును రక్షించుకోవడం చుట్టూనే ఈ ఆందోళనను సిద్ధం చేశారు. తీరా అదికాస్తా వలస వ్యతిరేక నినాదాలు, ప్రసంగాలు, ప్లకార్డులతో నిండిపోయింది. చాలావరకు ఈ ఆందోళన శాంతియుతంగా ముగిసింది. దీనికితోడు ప్రత్యర్థి గ్రూపులు కూడా ఆందోళన చేపట్టడంతో స్వల్ప ఘర్షణలు జరిగాయి. కానీ రాబిన్సన్ చేపట్టిన ఆందోళన వలసలపై వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఏకమైందో తెలియజేస్తోంది.
వలసకు వ్యతిరేకంగా టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్ష మందికి పైగా నిరసనకారులు మార్చ్ చేశారు. ఈ ప్రదర్శనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పలువురు పోలీస్ అధికారులపై దాడులు చేసినట్లుగా నివేదికలు వస్తున్నాయి. యునైట్ ది కింగ్డమ్ మార్చ్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఏకంగా 1లక్షా 10వేల మంది పాల్గొన్నట్లు పోలీసులు నివేదించారు.
టామీ రాబిన్సన్ తరుచుగా వలసల్ని వ్యతిరేకిస్తూ, ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. ఈయన అసలు పేరు స్టీఫెన్ క్రిస్టోఫర్ యాక్ల్సీ లెన్నాన్. 2009లో రాబిన్సన్ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు. ఇది ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేసే సంస్థగా పేరుంది. దీంతో రాబిన్సన్పై అనేక కేసులు నమోదయ్యాయి.
అయితే, దేశంలో జాతీయవాదానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచి, లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. పలు సందర్బాల్లో జైలుకు వెళ్లొచ్చాడు. అయితే, యూకేలో వలస వ్యతిరేక రాజకీయ పార్టీ, ఇతర ఎన్నికల్లో ముందంజలో ఉన్న రిఫార్మ్ యూకే మాత్రం రాబిన్సన్ ఉద్యమానికి దూరంగా ఉంది. నేరారోపణల కారణంగా ఆయనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో బ్రిటన్లో అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్కు చేరుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారని, వారిని ప్రభుత్వం తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోందని స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. వలసదారులు దేశ వనరులను, స్థానిక ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
కాగా ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా, వలస దారులతో దేశానికి భారం అవుతుందని వారి వాదన. వలసలతో దేశ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. కాగా వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్ల కొద్ది నెలలుగా నిరసనలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం యూకే లో గృహాలు, వేతనాల కొరత తీవ్రంగా ఉంది. వలసల కారణంగా ప్రజాసేవల రంగాలపై ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వలస విధానాన్ని లక్ష్యంగా చేసుకొన్నారు. భద్రతాపరమైన కారణాలు కూడా వీటికి తోడయ్యాయి. భారీ నేరాల్లో వలసదారుల పాత్ర ఉంటోంది.
కానీ, కావాలని భూతద్దంలో చూపడం తప్పుగా చూపిస్తూ రెచ్చగొట్టారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కూడా రాబిన్సన్ ఉద్యమానికి జనాలను తీసుకొచ్చింది. రాజకీయ నాయకులు, ఉద్యమకారులు ఉద్దేశపూర్వకంగానే భయాలు పెంచారు. వాటినుంచి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు.
ఇక ఆన్లైన్లో తప్పుడు ప్రచారం దీనికి తోడైంది. వలసపై సంచలన ఆరోపణలను ప్రచారంలోకి తెచ్చారు. ప్రజలు వీధుల్లోకి వచ్చేలా రెచ్చగొట్టారు. రాజకీయ లబ్ధికి వీధుల్లో నిరసనలకు వలసలను మించిన అంశం లేదన్న విషయం వారికి బాగా తెలుసు. అయితే ఒక్క యునైటెడ్ కింగ్డమ్లో ర్యాలీలే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇవి చోటుచేసుకొంటున్నాయి.
ఆస్ట్రేలియాలో మార్చి ఫర్ ఆస్ట్రేలియా పేరిట ఆ దేశంలోని పలు నగరాల్లో వేల మంది ప్రదర్శనలు నిర్వహించారు. మాస్ ఇమిగ్రేషన్ను ఇక ఆపేయాలని కోరారు. తీవ్రవాద గ్రూపులు తమ లక్ష్య సాధనకు ఈ ఆందోళనలను వాడుకొంటాయని అధికారులు నాడు హెచ్చరించారు. ఇక అమెరికాలో ఈ ఏడాది రికార్డు వలసలకు సంబంధించిన ఆందోళనలు జరిగాయి.
శరణార్థ శిబిరాలపై స్థానిక నిరసనల నుంచి కఠినమైన సరిహద్దు విధానాల అమలుకు డిమాండ్ చేస్తూ ర్యాలీలు చోటుచేసుకొన్నాయి. మరోవైపు ఐరోపా దేశాల్లో వార్సో, డుబ్లిన్, బెర్లిన్ నగరాల్లో శరణార్థి శిబిరాల ఏర్పాట్లపై, వలస విధానాలపై ఆగ్రహంతో ర్యాలీలు జరిగాయి. కాకపోతే ఇవి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యాయి.
ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది కానీ, రంగు, నేపథ్యం, ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సహించబోమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. అధికారులపై దాడులు చేయడం వల్ల నిరసనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని వ్యాఖ్యానించారు. సహనం, వైవిధ్యం, గౌరవమనే పునాదులపై బ్రిటన్ నిర్మితమైందని పేర్కొన్నారు. జాతీయ జెండా దేశంలో వైవిధ్యతను సూచిస్తుందని, హింస, భయం, విభజనకు చిహ్నంగా ఉపయోగించేందుకు దాన్ని ఎప్పటికీ అప్పగించబోమని వెల్లడించారు.
వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో జరిగిన ర్యాలీలో లక్షల మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్నారు. ‘యునైట్ ది కింగ్డమ్ పేరిట’ లండన్ వీధుల్లో నిరసనకారులు చేరి ర్యాలీ నిర్వహించారు. వారిని అదుపుచేసేందుకు పోలీసు యంత్రాగం తీవ్రంగా శ్రమించగా, నిరసన కారులు వారిపై వాటర్ బాటిళ్లు, ఇతరత్రా వస్తువులతో దాడికి దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు.
ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదని, జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు. అయితే ఈ వలస వ్యతిరేక ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. పడవలను ఆపండి, వారిని తిరిగి పంపేయండి, మా దేశాన్ని మాకు తిరిగివ్వండి అని ప్లకార్డులతో హోరెత్తించారు.
ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వలసలు, శరణార్థుల సంఖ్య పెరిగిపోవడంతో తమ సంస్కృతి దెబ్బతింటోందని, నేరాలు అధికమవుతున్నాయని బ్రిటన్లోని జాతీయవాద వర్గాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2024 చివరి నాటికి దేశంలో 5,15,697 మంది అధికారిక శరణార్థులు ఉన్నారు. మరో లక్షా 24 వేల మందికి పైగా ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారి సంఖ్య 10 నుంచి 15 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.
మరోవైపు వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రిఫార్మ్ యూకే తదితర పార్టీలకు ఇది కీలక అజెండాగా మారింది. రాబిన్సన్ ఈ అంశాన్ని మరింతగా పెద్దదిచేస్తూ, ర్యాలీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. టామీ రాబిన్సన్కు బిలియనీర్ ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖుల మద్దతు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా లండన్లో జరిగిన ర్యాలీలో నిరసనకారులు అమెరికా టోపీలు, ఇజ్రాయెల్ జెండాలు ప్రదర్శించారు. యాంటి ఇమిగ్రేషన్ నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శిస్తూ నిరసనల్లో పాల్గొన్నారు.
భారత్లో వృత్తి నిపుణులు, చిన్నస్థాయి ఉద్యోగాల కోసం చాలామంది పశ్చిమ దేశాలకు వెళుతుంటారు. తాజా పరిస్థితులు వారి జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాతి విద్వేషకులకు మైనార్టీలైన భారతీయులు లక్ష్యంగా మారతారు. గతంలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు వీరికి తేలిగ్గా లక్ష్యంగా మారింది. ఇక భారతీయులు రోజువారీ జీవితాలపై దీని ప్రభావం ఉంటుంది. చుట్టుపక్కల వారి నుంచి వివక్షను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
వారికి ఇళ్లు, ఉద్యోగాలు లభించడం కష్టం కావచ్చు. కొత్తగా విద్యా, ఉద్యోగాల కోసం వెళ్లేవారికి స్థానిక మద్దతు కరవు కావచ్చు. మన విదేశాంగ శాఖకు దౌత్యపరమైన ఇబ్బందులు కూడా తప్పవు. వలస వ్యతిరేక ఆందోళనలు రేగిన సమయంలో భారతీయులను కాపాడేందుకు అడ్వైజరీలు జారీ చేయడం లేదా చర్చలు జరపడం చేయాల్సిఉంటుంది. దేశీయ ఒత్తిళ్లు పెరిగి విదేశాంగ విధానంపై ప్రభావం చూపొచ్చు.
మా దేశం మాకివ్వండి అనే నినాదాలతో లండన్ వీధులు హోరెత్తాయి. ఒక్కో దేశంలో వలసలపై నిరసనలు హోరెత్తుతున్నాయి. మరి చూడాలి దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.



