అరుణాచల్‌లో కొండచరియలు బీభత్సం.. వాహనాలపై పడిన బండరాళ్లు

అరుణాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. బండరాయి ఒకటి కొండ పైనుంచి దొర్లుకుంటూ రావడం గమనించిన వాహనదారులు అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది. పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
కొండచరియలు విరిగిపడడంతో దిరాంగ్, తవాంగ్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుపై నిలిచిన రాళ్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.
కాగా, కొండ పైనుంచి రాళ్లు పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాళ్లను గమనించిన వాహనదారులు వేగంగా వెనక్కి రావడం, తోటి ప్రయాణికులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తోంది. ప్రాణభయంతో కొందరు ప్రయాణికులు వాహనాల నుంచి దిగి వెనక్కి పరుగులు తీశారు. వాహనదారుల అప్రమత్తత వల్లే ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు.



