KTR: సీఎం రేవంత్‌రెడ్డికి బేసిన్ల నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేదు

KTR: మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చర్చకు సిద్ధమంటూ ఇటీవల రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్ ప్రెస్‌క్లబ్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ అరాచక పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. దాదాపు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
బేసిన్ల నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం రేవంత్ చర్చకు రావాలన్నారు కేటీఆర్. బహిరంగ చర్చకు రేవంత్‌రెడ్డి సవాలు విసిరితే తాము చర్చకు వచ్చామని గుర్తుచేశారు. సవాలు విసిరిన సీఎం ఇక్కడకు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. సీఎం రాకపోతే మంత్రులైనా వస్తారని భావించినట్లు చెప్పారు.
ఇక బహిరంగచర్చకు రావాలని సీఎం రేవంత్‌కు మరోసారి చెబుతున్నట్లు వివరించారు కేటీఆర్. డేటు, టైమ్ రేవంత్ రెడ్డి చెబితే తాము తప్పకుండా వస్తామన్నారు. అసెంబ్లీలో చర్చిం చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మైకులు కట్ చేయకుండా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధమని కేటీఆర్ వెల్లడించారు.