అంతర్జాతీయం

Iran: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు

Iran Israel War: ఇరాన్- ఇజ్రాయెల్‌ మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న యుద్ధం ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై టెహ్రాన్‌ స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తొలుత అలాంటి ఒప్పందమేదీ లేదని పేర్కొన్న ఇరాన్‌ ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్లు సూచనప్రాయంగా చెప్పడం గమనార్హం. కాల్పుల విరమణపై ట్రంప్‌ పోస్టు పెట్టిన కొన్ని గంటల తర్వాత ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ మంగళవారం వెనువెంటనే రెండు విభిన్న పోస్టులు చేశారు.

‘ఇజ్రాయెల్‌లే తొలుత మాపై యుద్ధం ప్రారంభించింది. ఈ విషయాన్ని మేము ఇప్పటికే స్పష్టం చేశాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఏ ఒప్పందం లేదు. అయితే, టెల్‌అవీవ్‌ మా ప్రజలపై చేస్తున్న దురాక్రమణను మంగళవారం ఉదయం 4 గంటల్లోపు (టెహ్రాన్‌ కాలమానం ప్రకారం) ఆపేయాలి. ఈ సంఘర్షణలను కొనసాగించాలనే ఉద్దేశం మాకు లేదు. మా సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తాం’ అని అరాగ్చీ తొలుత రాసుకొచ్చారు.

కాసేపటికే ఆయన మరో పోస్టు చేశారు. అందులో టెల్‌అవీవ్‌పై టెహ్రాన్‌ సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరివరకు శక్తిమంతమైన పోరాటం కొనసాగించాయని అరాగ్చీ పేర్కొన్నారు.

దేశాన్ని కాపాడేందుకు, శత్రువుల దాడికి చివరి నిమిషం వరకు స్పందించిన దళాలకు ఆయన ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధమేనన్న సంకేతాలను టెహ్రాన్‌ ఇచ్చినట్లయ్యింది.

ఇక ఇరాన్, ఇజ్రాయెల్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్ వేదికగా ప్రకటించారు. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందన్నారు. ఈ కాల్పుల విరమణకు తొలుత ఇరాన్‌ అంగీకరించిందన్నారు. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుందని తెలిపారు. అయితే, ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా టెహ్రాన్‌ ప్రకటించడం గమనార్హం. దీనిపై ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button