Keerthy Suresh: పనిగంటలపై కీర్తి ఆవేదన!

Keerthy Suresh: ఇండస్ట్రీలో పనిగంటలపై గత కొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నటి కీర్తి సురేష్ తన అనుభవాలను బహిర్గతం చేశారు. నటులతోపాటు టెక్నీషియన్ల కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.
ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో పనిగంటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నటి కీర్తి సురేష్ తన అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు. ‘‘మహానటి సమయంలో ఒకే రోజు మూడు సినిమాల సెట్లకు వెళ్లి షూటింగ్ పూర్తి చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఉదయం ఒక చిత్రం, మధ్యాహ్నం మరొకటి, సాయంత్రం మరొకటి అలా బ్యాలెన్స్ చేశాను’’అని ఆమె తెలిపారు. అయితే ఇలాంటి షెడ్యూల్ ప్రతి యాక్టర్ కి సాధ్యం కాదని, ప్రతి ఒక్కరి సామర్థ్యం వేరని స్పష్టం చేశారు. 9 నుంచి 6 షిఫ్ట్ గురించి మాట్లాడుతూ ‘‘సాయంత్రం 6.30కి షూటింగ్ ముగిసినా ఇంటికి చేరేసరికి రాత్రి 10.30 అవుతుంది.
అప్పుడు జిమ్, ఇతర పనులు చేస్తే నటులకు రోజుకు ఆరు గంటల నిద్ర కూడా దక్కడం లేదు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. మరీ ముఖ్యంగా టెక్నీషియన్ల గురించి మాట్లాడుతూ ‘‘నటులు ఆలస్యంగా వచ్చినా ముందే వెళ్తారు. కానీ లైట్స్, కెమెరా, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు మాకంటే ముందు వచ్చి చివరివరకు ఉంటారు. మలయాళంలో లైట్మ్యాన్లకు రోజుకు 3-4 గంటల నిద్ర మాత్రమే దొరుకుతోంది’’అని ఆమె బహిర్గతం చేశారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో 9 to 6 షిఫ్ట్ ఉన్నా బాలీవుడ్, మాలీవుడ్‌లో మాత్రం ఇంకా 12 గంటల షిఫ్ట్‌లే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.



