అమెరికాకు ఇరాన్ అధినేత ఖమేనీ వార్నింగ్

ఇరాన్–అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తతల దిశగా దూసుకెళుతున్న నేపథ్యంలో, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ వ్యాఖ్యలు చల్లబడ్డ యుద్ధ వాతావరణాన్ని ఒక్కసారి వేడెక్కించాయి. అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల అమెరికా, ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడులు చేయగా, ఇరాన్ ఖతార్‌లోని అమెరికన్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఖమేనీ ప్రకటన బలమైన హెచ్చరిక మాత్రమే కాక, అణుకోణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. దాడులు చేస్తుంటే చూస్తూ ఇరాన్ మౌనంగా ఉండదని, దౌత్యం గానీ, యుద్ధం గానీ ఏ రంగమైనా, తాము బలంగానే ఉన్నామని ఖమేనీ అన్నారు. తమపై జరిగే ఏదైనా సైనిక దాడికి ప్రతిస్పందించడానికి తాము సిద్ధమన్నారాయన.
ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంలో జరిగినదానికంటే ప్రత్యర్థులు ఇంకా పెద్ద దెబ్బ రుచి చూపిస్తామన్నాడు. అమెరికా శక్తిని, దాని విశ్వాసపాత్రమైన కుక్క, జియోనిస్ట్ ఇజ్రాయెల్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నది వంద శాతం నిజమని ఖమేనీ అన్నారు.
గత నెలలో, ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అని ఇరాన్ చెప్పినా అమెరికా ఇరాన్ అణు, సైనిక సౌకర్యాలపై దాడులు చేసింది. ప్రతిగా ఇరాన్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది.
ఇరాన్ దాడి చేసిన స్థావరం చాలా సున్నితమైన అమెరికన్ ప్రాంతీయ స్థావరం. మొన్న చూపించింది ట్రయల్ మాత్రమేనని ఇతరులపై ఇంకా పెద్ద దెబ్బ వేయవచ్చని ఖమేనీ అన్నారు. ఇరాన్, అమెరికాతో అణు ఒప్పందానికి అంగీకరించాలని ఆగస్టు గడువు విధించింది. అప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకపోతే, 2015 ఇరాన్ ఒప్పందం మేరకు, అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
ఐతే, ముందస్తు షరతులతో తాము అమెరికాతో అణు చర్చలు తిరిగి ప్రారంభించలేమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. దౌత్యపరంగా ఇరాన్ ముందుకు వచ్చినప్పడల్లా మోసమే తమకు ఎదురైందని ఆ దేశమంటోంది. చర్చల వేదికపై తాము వచ్చినప్పుడు బలహీనమైన స్థానం నుండి కాకుండా, బలంగా వ్యవహరిస్తామని తాజాగా ఖమేనీ అన్నారు. దౌత్య మార్గదర్శకాలకు అనుగుణంగా అమెరికాను డీల్ చేస్తాన్నారు.
ఖమేనీ తాజా వ్యాఖ్యలు, ఇరాన్ దృక్పథంలో రాజీకి అవకాశమే లేదన్న స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు యూరప్ దేశాలు అణు ఒప్పందాన్ని తిరిగి ప్రారంభించేందుకు గడువు విధిస్తుండగా, ఇంకోవైపు ఇరాన్ తమ అణు హక్కులను గౌరవించాలనే మౌలిక స్థానం నుండి వెనక్కి తగ్గదని స్పష్టం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో, రెండు పక్షాల మధ్య తాత్కాలిక సంధి సాధ్యం కాదనిపిస్తోంది.