వ్యాపారం

Gold ETF: ఈక్విటీల నుంచి బంగారంలోకి పెట్టుబడులు

Gold ETF: అంతర్జాతీయంగా అనిశ్చితి పెరగడం, పసిడి ధర పరుగులు పెడుతుండటంతో పెట్టుబడిదారుల ఆసక్తి మారుతోంది. ఈక్విటీల నుంచి బంగారంలోకి పెట్టుబడులను మారుస్తున్నారు. సెప్టెంబరులో గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి వచ్చిన నిధుల ప్రవాహం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఆగస్టులో వీటిలోకి 2వేల190 కోట్ల పెట్టుబడులు రాగా, సెప్టెంబరులో ఈ మొత్తం నాలుగింతలై 8 వేల 363 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇది అత్యధికంగా ఉంది. దీంతో మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఆస్తుల విలువ 90 వేల కోట్లను మించింది. దీంతోపాటు వెండి ఈటీఎఫ్‌లకూ గిరాకీ పెరిగింది. పెట్టుబడిదారులు వైవిధ్యం కోసం విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది.

సెప్టెంబరులో మ్యూచువల్‌ ఫండ్ల ఆధ్వర్యంలోని ఏయూఎం 75.61 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టులో ఇది 75.19 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం పోర్ట్‌ఫోలియోల సంఖ్య 25.19 కోట్లకు చేరింది. గత నెలలో కొత్తగా 30.14 లక్షల ఫోలియోలు జతయ్యాయి. రిటెయిల్‌ ఫోలియోలు 19.81 కోట్లకు పెరిగాయి. 2025లో ఇప్పటివరకు పసిడి విలువ 62 శాతం పెరగడంతో, భారత్‌లో ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దేశ జీడీపీలో ఇది 89 శాతానికి సమానమని పేర్కొంది.

బ్యాంకులు తమ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోలో వ్యూహాత్మక మార్పులు చేశాయి. రిటైల్ పర్సనల్ గోల్డ్ లోన్ల వాటా అంతకుముందు 11 శాతం ఉండగా, 2025 మార్చి నాటికి 18 శాతానికి పెరిగింది. గోల్డ్ జ్యువెలరీ లోన్ల వల్ల వ్యవసాయం, ఇతర రుణాల వాటా 70 శాతం నుంచి 63 శాతానికి తగ్గింది. బంగారం ధరలు పెరగడం, అన్సెక్యూర్డ్​ లోన్ ప్రొడక్ట్స్​ వృద్ధి తక్కువగా ఉండటం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఎన్​బీఎఫ్​సీ గోల్డ్ లోన్ ఏయూఎం 30 నుంచి 35 శాతం వరకు విస్తరిస్తుందని భావిస్తున్నారు.

బంగారం ధర దాదాపు ఏడాదిన్నర కాలంలోనే రెట్టింపు అయింది. దీంతో ఆభరణాలను కొనుగోలు చేయలేని పరిస్థితి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎదురవుతోంది. ఆభరణాల విక్రయాలు తగ్గినట్లు వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో బంగారం ఆభరణాల తనఖా వ్యాపారం మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. ఆభరణాలు తనఖా పెట్టుకుని, అప్పులు ఇచ్చే సంస్థల వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది.

పసిడి ధర బాగా పెరిగినందున, గతంతో పోల్చితే బంగారంపై అప్పుగా ఎక్కువ సొమ్ము లభిస్తోంది. అందుకే ఎంతో మంది తమ అవసరాలకు ఆభరణాలను తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. 10 గ్రాముల బరువు ఉన్న 22 క్యారెట్ల పసిడి ఆభరణాన్ని తనఖా పెడితే బ్యాంకులు 70-75 వేల వరకు అప్పు ఇస్తున్నాయి. బ్యాంకింగేతర సంస్థలు ఇంకా అధికంగా 80- 85 వేలు మంజూరు చేస్తున్నాయి.

బంగారం ఆభరణాల లోన్ మార్కెట్లో బ్యాంకులు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నాయి. కొంతకాలంగా ఈ విపణిలో ఎన్‌బీఎఫ్‌సీలు తమ వాటా గణనీయంగా పెంచుకున్నాయి. బ్యాంకులు కార్పొరేట్, వ్యవసాయ, వ్యక్తిగత రుణాలపై దృష్టి సారిస్తూ గోల్డ్ లోన్స్‌ ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఎన్‌బీఎఫ్‌సీలకు కలిసొచ్చింది. ఇటీవల కాలంలో మళ్లీ బ్యాంకులు గోల్డ్ లోన్స్ అధికంగా ఇస్తున్నాయి.గోల్డ్ పెట్టుకుని బ్యాంకులు జారీచేసిన లోన్స్ ఈ ఏడాది మార్చి నాటికి 18 శాతానికి పెరిగాయి. ఏడాది క్రితం ఈ వాటా 11 శాతమే. ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చిన పసిడి రుణాలు ఈ ఏడాది మార్చికి రూ.2.4 లక్షల కోట్లకు చేరాయి. ఈ విభాగంలో ఏటా 41శాతం వృద్ధి నమోదవుతోంది.

పసిడి ధరలు దూసుకెళ్తున్నట్లే, వాటి లోన్‌పై తీసుకునే రుణాల మార్కెట్‌ పరిమాణమూ విస్తరిస్తోంది. ఈ ఏడాది మార్చిలో 11.8 లక్షల కోట్లుగా ఉన్న పసిడి రుణాల మార్కెట్, 2026 ఏడాది మార్చి నాటికి 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘2027 మార్చికి ఈ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని 2024 సెప్టెంబరులో సంస్థ అంచనా వేసింది. కానీ ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2027 మార్చి నాటికి ఈ విపణి విలువ 18 లక్షల కోట్లకు చేరుకోవచ్చని తాజా అంచనాలు పేర్కొంటున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button