అంతర్జాతీయం

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా

అమెరికా వాళ్లు తన్ని తగలేశారు.. ఇప్పుడు కెనడా వంతు వచ్చింది..? ఇండియన్స్ లక్ష్యంగా కెనడా చట్టాలకు పదును పెడుతోంది. చదువుకోడానికి అంటూ కెనడా వెళ్తూ అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను భారతీయులు తన్నుకుపోతున్నారన్న ఆలోచనలో ఉన్న కెనడా ఇప్పుడు ఇండియన్స్ వీసాలను పూర్తి స్థాయిలో రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటోంది.

భారతీయులను లక్ష్యంగా చేసుకుంటూ కెనడా ప్రభుత్వం సామూహిక వీసా రద్దు ప్రణాళికను రూపొందిస్తోందని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకేసారి గ్రూప్ వీసా తీసుకున్న వందల వీసాలను రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కెనడా ప్రణాళిక ద్వారా అధికారులు దీనిపై కసరత్తు చేస్తోన్నట్టు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ CBC న్యూస్ వెల్లడించింది.

కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ IRCC, కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ CBSA, అమెరికా సంస్థలతో కలిసి ఈ కొత్త వీసా రద్దు వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులకు సమూహిక వీసా రద్దు అధికారం ఇవ్వాలనే ప్రతిపాదనపై వర్కింగ్ గ్రూప్ పనిచేస్తోందని CBC నివేదించింది. ఈ నిర్ణయంతో ఇండియా, బంగ్లాదేశ్‌లను కట్టడి చేయాలన్న ఆలోచన ఈ చట్టం ద్వారా స్పష్టమవుతోంది.

ఇటీవల కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత విద్యార్థుల దరఖాస్తులలో 74 శాతం తిరస్కరించబడినట్లు ఆగస్టు నెల అధికారిక సమాచారం వెల్లడించింది. అంటే ప్రతి నాలుగు దరఖాస్తులలో మూడు తిరస్కరించారు. దీనివల్ల భారత విద్యార్థుల వీసా కలలు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయి. కెనడాలో ఆశ్రయం కోరే వారి సంఖ్య 2023 మేలో నెలకు 500లుగా ఉండగా, అది 2024 జూలై నాటికి నెలకు 2,000కి పెరిగాయని రికార్డులు చెబుతున్నాయి.

ఈ పెరుగుదల కెనడా అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ధృవీకరణ ప్రక్రియ కఠినతరం చేసి, వీసా ప్రాసెసింగ్ సమయం 30 రోజుల నుండి 54 రోజులకు పెంచారు. వీసా ఆమోదాలను కూడా పెద్ద ఎత్తున తగ్గించారు. 2024 జనవరిలో 63 వేల వీసాలు మంజూరు చేయగా, జూన్‌లో ఆ సంఖ్య 48 వేలకు పడిపోయింది. గత దశాబ్దంలో కెనడాకు అంతర్జాతీయ విద్యార్థుల అత్యధిక వనరుగా భారతదేశం ఉంది. ఐనా ఎందుకో ఈ వివక్ష అర్థం కావడం లేదు.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. భారతీయులను టార్గెట్ చేయడం దారుణమంటున్నాయి. కెనడాలోని పౌర సమాజ సంస్థలు, వలసదారుల హక్కుల పరిరక్షణ సంస్థలు ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ చట్టం కేవలం వీసా రద్దులకే కాకుండా, సామూహిక బహిష్కరణలకు దారితీసే ప్రమాదం ఉందని వారు అనుమానిస్తున్నారు. ఒక సమాజం లేదా దేశాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహికంగా వీసాలు రద్దు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు.

ఐతే ఇమ్మిగ్రేషన్ మంత్రి లీనా డయాబ్ మాత్రం ఈ అధికారాలను ఎదైనా వ్యాధులు విజృంభించినప్పుడు, యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉపయోగిస్తామన్నారు. అయితే, కెనడా రికార్డుల్లో నిర్దిష్ట వీసా హోల్డర్లు అనే పదం భారతీయులను కలవరపెడుతోంది. దీనిపై ఇప్పటికే 300కి పైగా పౌర సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దీనిపై ఇప్పటివరకు భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినా, విదేశాంగ వర్గాలు ఈ చట్టం భారత పౌరులను వివక్షపూరితమని భావిస్తోంది. గతంలో విద్యార్థి వీసా మోసాలు, ఫేక్ కాలేజ్ అనుమతులు వంటి ఘటనలను ఆధారంగా తీసుకుని కెనడా భారతీయులపై సామూహిక చర్యలు చేపట్టవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కెనడా పార్లమెంట్‌లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ప్రభుత్వం త్వరగా ఆమోదించాలని చూస్తోంది.

ఇది చట్టంగా మారితే, వేలాది భారతీయ విద్యార్థులు, వలసదారుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వలస చరిత్రలో ఇది సామూహిక వీసా రద్దు అయ్యే కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చినట్టమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కెనడా కొత్త వీసా చట్టం భారతీయులపై ఉక్కుపాదం మోపితే.. అది ఎలాంటి ప్రభావం చూపుతుంది. భారతీయులకు ఇప్పటికే ట్రంప్ అధికారంలోకి వచ్చాక పెరిగిన కష్టాలకు అంతే లేకుండా పోతుందా అన్న చర్చ మొదలవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button