IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టి20 మ్యాచ్

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్, వన్డే సిరీస్ ముగిసింది. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలుచుకోగా, టీం ఇండియా వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఇప్పుడు రెండు జట్లు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధంగా ఉన్నాయి. వన్డే సిరీస్ గెలిచిన ఊపులో టీ20ల్లోనూ నెగ్గి టెస్టుల్లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి గట్టి బదులివ్వాలని భారత జట్టుంది. గత ప్రపంచకప్ గెలిచాక వరుసగా సిరీస్‌లు సాధిస్తున్న సూర్యకుమార్ సేన సఫారీలనూ మట్టికరిపించి, ఇంకో రెండు నెలల్లో సొంతగడ్డపై మొదలయ్యే ప్రపంచకప్ దిశగా సన్నాహాలను వేగవంతం చేయాలని చూస్తోంది.
గత ఏడాది దక్షిణాఫ్రికాను దాని సొంతగడ్డపై ఓడించి సిరీస్ సాధించిన సూర్యకుమార్ సేన సొంతగడ్డపైనా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనుకుంటోంది. గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పునరాగమనం చేయబోతుండడం భారత్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.
టెస్టుల్లో భారత్‌తో సున్నా చుట్టించడమే కాక వన్డేల్లో గట్టి పోటీ ఇచ్చింది దక్షిణాఫ్రికా. టీ20ల్లోనూ ఆ జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. ఆ జట్టుకు టీ20ల్లో మార్‌క్రమ్ నాయకత్వం వహించనున్నాడు. అతడితో పాటు డికాక్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వన్డే సిరీస్‌లో వీళ్లిద్దరూ సెంచరీలు చేశారు.
డివాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బోష్ ఎంత ప్రమాదకరమో భారత్‌కు ఇప్పటికే అనుభవమైంది. వీరికి టీ20 స్పెషలిస్టులు రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్ తోడవుతున్నారు. ట్రిస్టన్ స్టబ్స్ కూడా ప్రమాదకర బ్యాటరే. బ్యాటింగ్‌లో ఆ జట్టు భారత్‌కు దీటుగా ఉంది. బౌలింగ్‌లో మాత్రం సఫారీ జట్టు కొంచెం బలహీనంగా కనిపిస్తోంది.



