భారత్- రష్యా మధ్య కీలక ఒప్పందాలు

భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక బంధం మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 2030 వరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు ఉద్దేశించిన ఒక సమగ్ర ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరువురు నేతలు ఆమోదం తెలిపారు.
ఆహార భద్రత, నౌకాయాన శిక్షణ, వైద్య శాస్త్రాలు, వినియోగదారుల రక్షణ, పోర్టులు, షిప్పింగ్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఒప్పందాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రష్యాకు చెందిన వినియోగదారుల రక్షణ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆహార ఉత్పత్తుల వాణిజ్యానికి మరింత ఊతమిస్తుంది.
ఇరు దేశాల సంబంధాలు అనేక చారిత్రక మైలురాళ్లను చేరుకుంటున్న తరుణంలో అధ్యక్షుడు పుతిన్ పర్యటన జరగడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. గత పదేళ్లలో ప్రపంచం ఎన్నో ఒడిదొడుకులను చూసిందన్నారు. ఈ గందరగోళం మధ్య కూడా భారత్-రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచిందన్నారు మోడీ.2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.
అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు.



