జాతియం

అణుశ‌క్తి కేంద్రాల స‌మాచారాన్ని పంచుకున్న ఇండియా, పాకిస్థాన్‌

భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు అణుశ‌క్తి కేంద్రాల స‌మాచారాన్ని పంచుకున్నాయి. అణు కేంద్రాల జాబితాను రెండు దేశాలు ఇచ్చి పుచ్చుకున్నాయి. అటామిక్ కేంద్రాల‌పై దాడి చేయ‌రాదు అన్న ఉద్దేశంతో ఆ స్థావ‌రాల వివ‌రాల‌ను రెండు దేశాలు ప‌ర‌స్ప‌రం పంచుకున్నాయి. సుమారు మూడు ద‌శాబ్ధాల నుంచి ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. పహల్గామ్ ఉగ్ర‌దాడి, ఆప‌రేష‌న్ సింధూర్ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య స‌రైన సంబంధాలు లేవు. అయినా కానీ రెండు దేశాలు పూర్తి స్థాయిలో అణు కేంద్రాల స‌మాచారాన్ని అంద‌జేసుకున్నాయి.

న్యూక్లియ‌ర్ కేంద్రాల‌పై దాడిని నిలువ‌రించే క్ర‌మంలో స‌మాచారాన్ని షేర్ చేసుకున్నట్లు విదేశాంగ శాఖ కార్యాల‌యం తెలిపింది. దౌత్య‌ప‌ర‌మైన రీతిలోనే ఈ జాబితా మార్పిడి జ‌రిగిన‌ట్లు తెలిసింది. అణుశ‌క్తి కేంద్రాల స‌మాచారాన్ని పంచుకునేందుకు 1988 డిసెంబ‌ర్ 31న ఒప్పందం కుదిరింది. అయితే 1991 జ‌న‌వ‌రిలో ఆ ఒప్పందం అమ‌లు జ‌రిగింది. ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ఆ స‌మాచారాన్ని పంచుకుంటారు. అణు కేంద్రాల జాబితాను పంచుకోవ‌డం ఇది 35వ‌సారి అవుతుంది. 1992 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన తొలిసారి స‌మాచారాన్ని షేర్ చేసుకున్నారు.

ఈసారి జాబితాల మార్పిడి ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగింది. గత ఏడాది మే నెలలో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీనికి దీటుగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌పై విరుచుకుపడింది. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఈ సైనిక ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సంబంధాలు ఇంతలా దెబ్బతిన్నప్పటికీ, అణు కేంద్రాల జాబితా మార్పిడి ఆగకపోవడం విశేషంగా నిలిచింది.

అణు కేంద్రాల వివరాలతో పాటు, ఒకరి జైళ్లలో ఉన్న మరొకరి ఖైదీల వివరాలను కూడా ఇరు దేశాలు మార్చుకున్నాయి. 2008లో కుదిరిన ‘కాన్సులర్ యాక్సెస్’ ఒప్పందం ప్రకారం ఇది జరుగుతుంది. ప్రతి ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో, అంటే ఏడాదికి రెండుసార్లు ఈ వివరాలు ఇస్తారు. భారత్ తన జైళ్లలో ఉన్న పాకిస్థానీల వివరాలను ఆ దేశానికి అందించింది. అలాగే పాకిస్థాన్ కూడా తన కస్టడీలో ఉన్న భారతీయుల వివరాలను ఢిల్లీకి పంపింది.

విదేశాంగ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రస్తుతం భారత జైళ్లలో 391 మంది పాక్ పౌరులు ఉన్నారు. వీరితో పాటు 33 మంది పాక్ మత్స్యకారులు కూడా ఉన్నారు. వీరి వివరాలను భారత్ పాకిస్థాన్‌కు అందించింది. పాక్ జైళ్లలో 58 మంది భారతీయ పౌరులు, 199 మంది భారతీయ మత్స్యకారులు బందీలుగా ఉన్నట్లు ఆ దేశం జాబితా ఇచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button