అంతర్జాతీయం

ట్రంప్ దెబ్బకు…అమెరికాకు తగ్గిన వలసలు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలను వలసల సమస్య పట్టి పీడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వలసదారుల సంఖ్య 30.4 కోట్లుగా ఉంది. పాశ్చాత్యదేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో అక్రమ వలసలపై జనం ఆగ్రహంగా ఉన్నారు. తమ అవకాశాలను వలసదారులు దోచుకోవడంతో పాటు జీవితాల్ని సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఆయా దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లేటెస్టుగా బ్రిటన్ లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది.

బ్రిటన్ లోని కీలక నగరాల్లో వలసలపై ఆగ్రహజ్వాల పెల్లుబుకింది. అయితే ఒకప్పుడు ఇతర దేశాలకు వలసవెళ్లి దాడులకు, దోపిడీకి పాల్పడిందీ వారే.. వారి సంస్కృతిని రుద్ది, స్థానిక సంస్కృతులను నాశనం చేసిందీ వారే అదే బ్రిటీషర్లు ఇప్పుడు తమ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆస్ట్రేలియాలోనూ వలస వ్యతిరేక నిరసనలు ఉద్ధృతం అయ్యాయి. ఇక ట్రంప్ దెబ్బకు అమెరికాకు వెళ్లాలనుకునే వలసదారులు వెనక్కి తగ్గుతున్నారు.

పశ్చిమదేశాల్లో ఇటీవలి కాలంలో వలసలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకొని అక్కడి రాజకీయ పార్టీలు ప్రజలను ఎగదోసి లబ్ధి పొందుతున్నాయి. దీనిని అమెరికాలోని రిపబ్లికన్ల విషయంలో స్పష్టంగా చూడొచ్చు. ఇటీవల కాలంలో జర్మనీ, ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా ఇలా కీలక ఐరోపా దేశాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా యూకేలో టామీ రాబిన్సన్‌ నేతృత్వంలో జరిగిన వలస వ్యతిరేక ఆందోళనలు కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపింది.

దీనికి ఏకంగా లక్ష మంది హాజరుకావడంతో లండన్‌ వీధులు జనసంద్రంగా మారాయి. ఇంగ్లాండ్‌ సంస్కృతి, గుర్తింపును రక్షించుకోవడం చుట్టూనే ఈ ఆందోళనను సిద్ధం చేశారు. తీరా అదికాస్తా.. వలస వ్యతిరేక నినాదాలు, ప్రసంగాలు, ప్లకార్డులతో నిండిపోయింది. దీనికితోడు ప్రత్యర్థి గ్రూపులు కూడా ఆందోళన చేపట్టడంతో స్వల్ప ఘర్షణలు జరిగాయి. కానీ, రాబిన్సన్‌ చేపట్టిన ఆందోళన వలసలపై వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఏకమైందో తెలియజేస్తోంది.

ప్రపంచీకరణ మూలంగా యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో కొన్ని దేశాల్లో జాతి వివక్ష, జాతి అహంకారం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు వలసవాదులకు ఆహ్వానం పలికిన దేశాలు నేడు నో ఎంట్రీ అంటున్నాయి. దీనికి ఆర్థిక సమస్యలు, నేరాలు, జాతీయవాద భావాలు, ఉపాధి లేమి, ఆయా దేశాల్లో పెరుగుతున్న జనాభా, రాజకీయ కారణాలు ఈ వలసలకు వ్యతిరేకంగా నిలిచాయి.

బంగ్లాదేశ్ స్వతంత్ర కోసం కృషి చేసిన దేశం, వివిధ దేశాలకు స్నేహ హస్తం అందించిన దేశం, శాంతిస్థాపనకు శాంతి పరిరక్షణ సైన్యాన్ని పంపించిన మన దేశం నేడు అమెరికా, కెనడా, బ్రిటన్, మధ్య ప్రాచ్య దేశాల్లో ద్వేషపూరిత దాడులు, వివక్షకు గురి అవుతున్నది. యూఏఈ, సౌదీ, ఖతార్​లో భారతీయ కార్మికులు, అమెరికా, బ్రిటన్, కెనడాలోని భారత ప్రవాసీయులు జాతి వివక్షను అనుభవిస్తున్నారు. కొన్ని దేశాలు వారి అతి జాతీయ భావం, అభద్రతా భావంతో యూఎన్​ఓ, ప్రపంచీకరణ సూత్రాలకు విరుద్ధంగా జాతి వివక్ష సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న అమెరికా, నిన్న కెనడా, నేడు ఆస్ట్రేలియా, బ్రిటన్ భారతీయుల వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బ్రిటన్​లో అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ‘అక్రమ వలసలను అడ్డుకోండి’.. ‘మా దేశాన్ని మాకివ్వండి’ అంటూ నిరసనకారులు తమ నినాదాలతో లండన్ వీధులను హోరెత్తించారు. ప్రముఖ జర్నలిస్ట్, జాతీయవాద యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో లండన్ నడిబొడ్డున జరిగిన ఈ భారీ నిరసన ర్యాలీలో సుమారు1.50 లక్షల మంది పాల్గొన్నారు. ‘యునైటెడ్ కింగ్ డమ్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో నిరసనకారులంతా బ్రిటన్ జాతీయ జెండాలు, సెయింట్ జార్జ్ రెడ్ అండ్ వైట్ ఫ్లాగ్స్, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ‘పడవలను ఆపండి’, ‘వారిని తిరిగి పంపండి’, ‘ఇక చాలు, మన పిల్లలను కాపాడండి..’ అంటూ స్లోగన్స్ ఇచ్చారు.

మరోవైపు, వలసదారులకు మద్దతుగా స్టాండప్ టు రేసిజం గ్రూపు ఆధ్వర్యంలో ‘మార్చ్ అగైనెస్ట్ ఫాసిజం’ పేరుతో సపరేట్​గా మరో ర్యాలీ జరిగింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కోసం జరుగుతున్న ఉద్యమమని, బ్రిటిష్ ప్రజలకు మేలుకొలుపు వంటిదని ఇంగ్లిష్​ డిఫెన్స్ లీగ్ వ్యవస్థాపకుడైన టామీ రాబిన్సన్ అన్నారు. అయితే, బ్రిటన్​కు అక్రమ వలసలు పెరగడం వల్ల ముస్లింల ఆధిపత్యం పెరుగుతోందని, తమ సంస్కృతి పూర్తిగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని నిర్మించిన బ్రిటిష్ ప్రజల కంటే వలసదారులకే కోర్టుల్లో ఎక్కువ హక్కులు ఉంటున్నాయన్నారు. అందుకే నేడు బ్రిటన్​లో కల్చరల్ రెవల్యూషన్ ప్రారంభమైందన్నారు. ఈ ర్యాలీలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఫ్రెంచ్ పొలిటీషియన్ ఎరిక్ జెమౌర్ కూడా వర్చువల్​గా మాట్లాడారు. ముస్లింల వలసల వల్ల బ్రిటన్ కు ముప్పు తప్పదని, ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయకపోతే నాశనం తప్పదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ర్యాలీలో ఇస్లామిక్ స్టేట్, పాలస్తీనా, ముస్లిం బ్రదర్ హుడ్ జెండాలను చింపివేస్తూ నిరసనలు తెలిపారు. అక్రమ వలసల వల్ల బ్రిటన్ సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగా మారిపోతోందని, బ్రిటన్ సొంత కల్చర్ ను తిరిగి తీసుకొద్దామని రాబిన్సన్ ఫాలోవర్లు పిలుపునిచ్చారు. ఇది ఫాసిజం కాదని, దేశభక్తి వాదమని స్పష్టం చేశారు. మరోవైపు అక్రమ వలసలకు వ్యతిరేకంగా లండన్​లో జరిగిన భారీ నిరసన ర్యాలీపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైలెంట్ అయ్యారు. అంతేకాకుండా లండన్ లో నిరసనలు జరుగుతున్న సమయంలోనే ఎమిరేట్స్ స్టేడియంలో ఆయన కొడుకుతో కలిసి ఫుట్​బాల్ మ్యాచ్​ వీక్షించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

బ్రిటన్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉన్నత చదువుల కోసం దక్షిణాసియా, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. వారంతా చట్టబద్ధంగా వీసాలు తీసుకుని వస్తున్నవారు. మరోవైపు అంతర్యుద్ధాలు, కరువు బాధిత దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు సముద్రం మీదుగా చిన్నచిన్న బోట్లలో అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశిస్తున్నారు. తమకు ఆశ్రయం ఇవ్వాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. స్థానికులమైన తమ కంటే కూడా వలస వచ్చినవారే ఎక్కువైపోయారని తమ పన్నుల ఆదాయం వారికి ఖర్చుపెట్టడం ఏమిటంటూ బ్రిటీషర్లలో కొన్నేళ్లుగా ఆందోళన పెరిగిపోయింది.

అలా శరణార్థులుగా వచ్చినవారిని స్థానిక బ్రిటీషర్లు చులకనగా చూడటం, జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం వంటివి పెరిగాయి. మరోవైపు ఆఫ్రికా, ఇస్లాం దేశాల నుంచి వచ్చిన శరణార్థుల్లో కొందరు దోపిడీలు చేస్తుండటం, తమకు చులకనగా చూస్తున్న బ్రిటిషర్లపై దాడులు చేయడం సమస్యగా మారింది. బ్రిటన్‌లోని తీవ్ర జాతీయవాద పార్టీలు, నేతలు విదేశీయుల వలసలను, శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడాన్ని తప్పుపడుతూ పోరాటాలు లేవనెత్తుతున్నారు. సోషల్‌ మీడియాలోనూ ఇది తీవ్ర స్థాయికి చేరింది. బ్రిటన్‌ స్థానికుల్లో వలసలకు వ్యతిరేక భావజాలం పెరిగిపోయింది. యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2024 చివరి నాటికి అక్కడ 5,15,697 మంది శరణార్థులు ఉన్నారు.

వలస వచ్చినవారి విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వం అధికారికంగా ఆశ్రయం ఇచ్చినవారి సంఖ్య ఇది. అదే సమయంలో అక్రమంగా వచ్చిన మరో 1,24,841 మంది శరణార్థులుగా ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారు. ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో మరో లక్ష మందికిపైగా అక్రమంగా యూకేలోకి వచ్చి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. ఎలాంటి గుర్తింపు పొందకుండా, దరఖాస్తు చేసుకోకుండా ఉంటున్నవారు కూడా లక్షల్లో ఉంటారు. వీరిలో చాలా మంది ఆఫ్రికా, మధ్యప్రాచ్య ముస్లిం దేశాల నుంచి వచ్చినవారే. మరోవైపు పర్యాటక, విద్యార్థి వీసాలపై వచ్చి.. గడువు ముగిసినా బ్రిటన్‌లోనే ఉండిపోయిన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. మొత్తంగా శరణార్థులు, అక్రమంగా ఉంటున్నవారు కలిపి 10-15 లక్షల మంది వరకు ఉంటుందని అంచనా.

అయితే వ్యాపారం పేరిట చిన్న చిన్న పడవలు వేసుకుని సముద్రాలు దాటి వలస వచ్చింది బ్రిటీష్ వారే.. స్థానికులపై దాడులకు, దోపిడీకి పాల్పడిందీ వీరే వీరి సంస్కృతిని రుద్ది, స్థానిక సంస్కృతులను నాశనం చేసిన బ్రిటీషర్లు ఇప్పుడు తమ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని మొత్తుకుంటున్నారు. ఒకప్పుడు తాము వలసవెళ్లి అణగదొక్కి, పాలించి, దోచుకున్న ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల వారు ఇప్పుడు.. తమ దేశంలోకి వచ్చి చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలసదారులు తమ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారిని తిప్పిపంపేయాలంటూ నిరసనలకూ దిగుతున్నారు. ఇక ప్రస్తుతం యూకేలో గృహాలు, వేతనాల కొరత తీవ్రంగా ఉంది. వలసల కారణంగా ప్రజాసేవల రంగాలపై ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

దీంతో వలస విధానాన్ని లక్ష్యంగా చేసుకొన్నారు. భద్రతాపరమైన కారణాలు కూడా వీటికి తోడయ్యాయి. భారీ నేరాల్లో వలసదారుల పాత్ర ఉంటోంది. కానీ, కావాలని భూతద్దంలో చూపడం.. తప్పుగా చూపిస్తూ రెచ్చగొట్టారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కూడా రాబిన్సన్‌ ఉద్యమానికి జనాలను తీసుకొచ్చింది. రాజకీయ నాయకులు, ఉద్యమకారులు ఉద్దేశపూర్వకంగానే భయాలు పెంచారు. వాటినుంచి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. సంప్రదాయవాదులైన ఇన్‌ఫ్లూయెన్సర్లు, కామెంటేటర్లు వీలైనంతగా వారి సందేశాలను వ్యాప్తి చేశారు. ఇక ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రచారం దీనికి తోడైంది. వలసలపై సంచలన ఆరోపణలను ప్రచారంలోకి తెచ్చారు. ప్రజలు వీధుల్లోకి వచ్చేలా రెచ్చగొట్టారు.

మరోవైపు ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో వలస వ్యతిరేక నిరసనలు తీవ్రం అయ్యాయి. పలు నగరాల్లో వేలాది మంది ఆస్ట్రేలియన్లు భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకుని ప్రదర్శనలు చేపట్టారు. తమ దేశానికి ఇండియన్లు ఎక్కువగా వచ్చిదేశ జనాభా, సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తమ దేశం వదిలి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరుతో ఈ ఏడాది ఆగస్టు 31న ఆస్ట్రేలియాలోని సుమారుగా 20 మహానగరాల్లో ర్యాలీ నిర్వహించారు. ఇది ముఖ్యంగా అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసన. సుమారుగా పదివేల మంది నిరసనతో సిడ్నీ దద్దరిల్లింది.

మరోవైపు భారతీయ విద్యార్థులు, నివాసితుల భద్రతకు భరోసా ఇవ్వాలని భారత ప్రభుత్వం ఆస్ట్రేలియాను కోరింది. వాస్తవానికి ఆస్ట్రేలియా జనాభాలో వలసలు ఎప్పటి నుంచో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. ఆస్ట్రేలియా మొత్తం జనాభా 2.72 కోట్ల కాగా, 31శాతం మంది ఇతర దేశాల నుంచి వలస వచ్చిన పౌరులే ఉన్నారు. చారిత్రక వలసల నమూనాలతో పోల్చినప్పుడు.. భారతీయ వలసదారుల సంఖ్య శాతం పరంగా పెరిగినప్పటికీ.. దేశ జనాభాలో వారి శాతం ఇప్పటికీ స్వల్పమే. గడిచిన కొద్ది సంవత్సరాలలో భారతదేశం నుంచి వలస వచ్చిన వారి సంఖ్య కాస్త పెరిగింది.

బ్రిటన్ తరువాత ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద వలస సమాజం భారతీయ సంతతి వారిదే. అయితే సుమారు 8.4 లక్షల మంది భారతీయ మూలాలున్నవారు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ.. ఇది దేశ జనాభాలో కేవలం 3.2 శాతానికి మాత్రమే పరిమితం అయింది. కానీ నిరసనకారులు మాత్రం గత ఐదు సంవత్సరాలలో ఆస్ట్రేలియాకు వచ్చిన భారతీయుల సంఖ్య, గత 100 సంవత్సరాలలో గ్రీక్, ఇటాలియన్ల కంటే ఎక్కువ అంటూ ఆరోపిస్తున్నారు. ఇది కేవలం వలసలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని.. దేశ జనాభా, సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నమంటున్నారు.

మరోవైపు ట్రంప్ దెబ్బకు అమెరికాకు వెళ్లాలనుకునే ప్రపంచ దేశాల ప్రజలు వెనక్కి తగ్గుతున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న ఆంక్షలతో అమెరికా అంటేనే భయపడుతున్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఏకంగా 15 లక్షల మంది అమెరికాకు వలసదారులు తగ్గిపోయారని తెలుస్తోంది. మొత్తం వలసదారుల సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయినట్లు సమాచారం.

అమెరికా నుంచి భారీగా బహిష్కరణలు, అరెస్ట్‌లు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షల కారణంగా వలసదారుల సంఖ్య గణనీయంగా క్షీణించింది. ముఖ్యంగా అనధికారికంగా అమెరికాలోకి వచ్చే వలసల సంఖ్య కూడా భారీగా తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలపైనా ప్రభావం చూపిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో నిర్ణయాలు, విధానాలు, ఉత్తర్వులు వెలువరిస్తున్న ట్రంప్ అమెరికన్లకే పెద్దపీట వేస్తున్నారు.

ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. అదే సమయంలో విదేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వలసదారుల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇక వీసా గడువు ముగిసిన వారు, అక్రమ మార్గాల్లో అమెరికాలోకి చొరబడినవారు, ఇతర అక్రమ వలసదారులను గుర్తించి వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు అమెరికా అంటేనే ఎగిరి గంతేసి వెళ్లే ప్రపంచ దేశాల ప్రజలు ఇప్పుడు అమెరికా పేరు చెబితే జంకుతున్నారు.

మరోవైపు బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీలో వలస వ్యతిరేక మార్చ్‌లు పెరుగుతున్నాయి, ఫార్‌–రైట్‌ పార్టీలు బలపడుతున్నాయి. యూరప్‌లో ముస్లిం జనాభా పెరుగుదల , నేరాలు పెరగడం వలసల విధానాలను ప్రశ్నిస్తున్నాయి. యూకేలో చేపట్టిన ర్యాలీ ‘అతిపెద్ద యాంటీ–ఇమిగ్రేషన్‌ ర్యాలీ‘గా చెప్పబడుతోంది, ఈ నిరసనలు వలసలను అరికట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి.

అయితే ప్రతి మనిషి సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు పొందాల్సిన హక్కు కలిగినవాడే. జాతి, వర్ణం, మతం, భాష అనే భేదాలు మనిషి విలువను నిర్ణయించవు. కాబట్టి, జాతి అహంకారాన్ని నిర్మూలించి, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవతా విలువలతో ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మానవ వనరులు అధికంగా ఉన్న భారతదేశం ప్రపంచానికి చాలా అవసరం. ఇతర దేశాల్లో భారతీయులకు ఎదురవుతున్న జాత్యహంకారం పట్ల కేంద్రం కట్టుదిట్టమైన దౌత్య వ్యవహారాలను నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button