తెలంగాణ

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్‌కు భారీ స్థాయిలో నామినేషన్లు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజైన మంగళవారం ఒక్కరోజే 160 మందికిపైగా నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ మొదలవగా 18 వరకు 94 మంది అభ్యర్థులు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆదివారం, దీపావళి పండుగతో రెండు రోజులు సెలవు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు. చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు.

అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశముండటం, అభ్యర్థులు పెద్దసంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్‌ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్‌ వేసేవారికి ముందు టోకెన్‌ ఇచ్చి అనంతరం నామపత్రాలు స్వీకరించారు. 188 మందికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 2 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలు కాగా, ఆ తరువాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది.

నామినేషన్లు దాఖలు చేసిన వారిలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు, ఫార్మాసిటీ భూనిర్వాసితులు, నిరుద్యోగులు ఉన్నారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. 11 మంది రైతులు నామినేషన్‌లు వేశారు. ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులు కూడా మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు వచ్చారు. కాగా, ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్‌లు వేశారు.

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమితి నుంచి 11 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. భారీగా నామినేషన్లు దాఖలు కావడం ప్రధాన పార్టీలకు వణుకు పుట్టిస్తోంది. ఎక్కువ మంది బరిలో ఉంటే వారికి ఏ గుర్తులు కేటాయిస్తారు, ఆ ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 24 వరకు నామినేషన్ల ఉపంసహరణకు అవకాశముంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button