Musi River: 42 ఏళ్ల తర్వాత మూసీ మహోగ్ర రూపం

Musi River: మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు సెప్టెంబర్ గండం ఉందా..? అంటే.. అవుననే సమాధానం వినబడుతోంది. సరిగ్గా 117 ఏండ్ల క్రితం అంటే 1908 సెప్టెంబరు 26, 27, 28 తేదీలలో హైదరాబాద్ మహా నగరాన్ని మూసీ నది వరదలు ముంచెత్తాయి. ఈ విపత్తు భాగ్యనగరంలో తీవ్రమైన విధ్వంసం సృష్టించి ప్రజలకు చేదు జ్ఞాపకాలు మిగిల్నింది. ఆ రోజు ఓ చీకటి రోజుగా మిగిలిపోయింది. మళ్లీ ఇప్పుడు 2025లో సెప్టెంబర్‌లో మూసీనది విధ్వంసం సృష్టించింది. ఇంతకీ మూసీ మహోగ్రరూపం దాల్చడానికి కారణమేంటి..? ఈ ప్రకృతి ప్రకోపానికి రీజన్ ఏంటి..? అసలు అధికారులు చేస్తున్న చర్యలెంటి..?
హైదరాబాద్ చెరగని చీకటి అధ్యాయంగా మూసీనది వరద మరోసారి విజృంభించింది. ప్రజలు అధికారులు ఊహించని విధంగా జల ప్రళయంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. అందరూ నిద్రావస్తలో ఉన్న సమయంలో మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సరిగ్గా ఇదే రోజు 1908 సెప్టెంబర్ 27న మూసీ నది నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. అంతకు రెండు రోజుల క్రితం తుంపరలుగా మొదలైన వర్షం భీకరంగా మారింది.
ఆరోజు రాత్రి 15.38 సెంటీ మీటర్ల వర్షంతో సిటీ అతలాకుతలమైంది. పరీవాహక ప్రాంతంలో నీ చెరువులు నిండిపోయాయి శంషాబాద్ ఏరియాలో ఒక్కరోజే 12.05 సెంటీ మీటర్లువర్షం కురిసింది. మూసీ నది రెండు ఒడ్డులమధ్య దూరం 700 అడుగులే. కానీ వరదల సమయంలో కిలో మీటర్ కు మించిపోయింది. మూసీ నీళ్లు ఏరులై పారి అర్థరాత్రి జల విలయం సృష్టించాయి .
ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్రాంతంలో ఆనాడు 200 మంది గల్లంతయ్యారు. పేట్లబురుజు ప్రాంతంలో వంతెనల పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వంతెన గోడలు కూలి జనం కొట్టుకుపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన కొందరు రాజభవనాల్లో తలదాచుకున్నారు. మూసి నది వరదలు మనుషుల ప్రాణాలు, ఆస్తులతో పాటు చారిత్రక ప్రాధాన్యత కలిగిన వారసత్వ సంపదను దెబ్బతీశాయి. మూసీ నదికి ఉత్తరం వైపున ఉన్న ఉద్యానవనంలోని ఓ భారీ చింతచెట్టుపైకి ఎక్కిన 150 మంది. ప్రాణాలు కాపాడుకోగలిగారు.
ఇప్పుడు మళ్లీ మూసీ తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కట్టులు తెచ్చుకుని వరద నీరు వచ్చేసింది. మూసీ పక్కనే ఉన్న ఎజీబీఎస్ బస్టాండ్ లోకి వరద నీరు వచ్చేసింది. దరస పండుగ నిమిత్తం అందరూ సొంతూళ్లకు బయలుదేరారు. అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కడి నుంచి నీరు వస్తుందో తెలుసుకునే లోపే బస్టాండ్ మొత్తం జలదిగ్భంలో మునిగిపోయింది. బస్టాండ్ లో ఉన్నవాళ్లందరూ ప్రాణభయంతో వణికిపోయారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు తాళ్ల సహయంతో ప్రయాణికులను బయటకు తరలించారు. అయితే మూసీ ఉధృతి కేవలం బస్టాండ్‌కే పరిమితం కాలేదు. చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో సుమారు 200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు.
దసరా పండుగకు జనాలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దమయ్యే సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్ సముద్రాన్ని తలపించింది. ఏకంగా బస్టాండ్ మొత్తం జలదిగ్భంధంలో కూరుకుపోయి. బస్సు మునిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లో నగరానికి వరద ముప్పు వాటిల్లింది. మూసీ తీరంపై క్లౌడ్ బరస్ట్ ఉగ్రరూపాన్ని చూపింది.
వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు రాజధాని రహదారులు ఏరులను తలపించాయి. రోడ్లన్నీ ద్వంసమయ్యాయి. వరద వీళ్లతో కాలనీలు నిండిపోయాయి. ఇండ్లు, అపార్ట్ మెంట్లలోకి కూడా నీళ్లు చొచ్చుకొని పచ్చాయి. నగర జీవితం అస్తవ్యస్తమైంది. చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర వరద ప్రవహించింది. మూసారాంబాగ్ వంతెన పైనుంచి ఏకంగా 10 అడుగుల మేర నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరుస పెట్టి కురుస్తున్న వర్షాలతో పాటు.. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా గడిచిన మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా మూసీ ఉగ్రరూపు దాల్చింది. దీంతో.. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ వణికిపోతున్న పరిస్థితి. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చి, లోతట్టు ప్రాంతాలు, వంతెనలు నీట మునిగాయి.
మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, పాత మలక్‌పేటలోని శంకర్‌నగర్ కాలనీవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, డీఆర్‌ఎఫ్, పోలీస్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందిని సహాయ చర్యల్లోకి దింపారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా ఏర్పాటు చేశారు. చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జిపైనుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిల పైనుంచి రాకపోకలను నిలిపివేయటంతో చాదర్‌ఘాట్ హైయర్ బ్రిడ్జిపై వాహనాల రద్దీ పెరిగి చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట సూపర్‌బజార్ వరకు ట్రాఫిక్ స్థంభించిపోయింది.
అలాగే గ్రేటర్ పరిధిలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల గేట్ల ఎత్తివేతతో మూసీ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు శివాజీ బ్రిడ్జి కింద భూ లక్ష్మీ ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మందిని గోడె కీ ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. మూసీ నదిలో నీటి ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ కోరారు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచందన అన్నారు. సికింద్రాబాద్ రసూల్‌పురాలోని ప్యాట్నీ నాలా వద్ద వరద ఉద్ధృతిని ఆమె పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ఇండ్లలోకి నీళ్లు రావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమైతే కలెక్టరేట్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు వెయ్యి మందికిపైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వరద ఉధృతికి ప్రధాన కారణం.. ఉస్మాన్ సాగర్ గేట్లను ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఎత్తడమేనని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా వరద పోటెత్తి అల్లకల్లోలం సృష్టించింది.
నార్సింగి – మంచిరేవుల మధ్య ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో కూడా వరద ఉధృతి పెరగడంతో నలుగురు వ్యక్తులు ఆటో ట్రాలీలో చిక్కుకుపోయారు. మార్గంలో వెళ్లకూడదని బారికేడ్లు ఏర్పాటు చేసినా, డ్రైవర్ పట్టించుకోకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే స్పందించి, ఆ నలుగురిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. చిక్కుకుపోయిన ఆటో ట్రాలీకి తాడు కట్టి, డీఆర్ఎఫ్ వాహనంతో బయటికి లాగారు.
మరోవైపు ఎంజీబీఎస్ బస్సు సర్వీసులను అధికారులు దారి మళ్లించారు. నల్గొండ, ఖమ్మం నుంచి వచ్చే బస్సులను ఎల్బీ నగర్ వరకు మహబూబ్ నగర్, కర్నూల్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకు.. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ వరకు మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. మరోవైపు మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్, చాదర్ ఘాట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎంజీబీఎస్ చుట్టూ భారీగా బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. వరద చుట్టుముట్టడంతో కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.
కాగా 1908లో కూడా సెప్టెంబర్ 26నే మూసీ నదికి వరదలు వచ్చాయి. అప్పుడు వచ్చిన వరదలకు వేలాది మంది ప్రాణా లు కోల్పోగా, దాదాపు 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. మళ్లీ ఇప్పుడు సెపె్టంబర్26నే మూసీ వరద ముంచెత్తడంతో నాటి సంఘటనలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. నిజానికి ప్రజాస్వామిక ప్రభుత్వాల కంటే నిజాం రాజులే వాటి బీభత్సానికి తీవ్రంగా చలించారు. తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి నిలిపారు. 1908 సెప్టెంబర్ 28న మూసీ విలయం సంభవించింది.
తర్వాత రెండేళ్లకే హైదరాబాద్ పై ప్లేగు మహమ్మారి దాడి చేసింది. తీవ్రమైన ప్రాణనష్టం జరిగింది. 1908 సెప్టెంబర్ 26, 27 తేదీల్లో పడిన భారీ వర్షాలతో మొదట పాలమాకుల చెరువు గట్టు తెగింది. ఆ వరద నందుల కత్వ చెరువును చేరింది. ఆ చెరువు కూడా వరద తాకిడి తట్టుకోలేక పోయింది. గొలుసుకట్టులోని మరోనాలుగైదు చెరువులు కూడా గట్లు తెగాయి. నీళ్లు చందనవ ఖి డ్యాము ను చేరాయి. డ్యామ్ తెగి నీళ్లు ఫిరంగి నాలాను ముంచెత్తాయి. ఫిరంగి నాలా నుంచి ఈసా నదిని చేరాయి. ఈసా నది ఉప్పొంగి మూసీని చేరింది. మూసీ ఉగ్రరూపం దాల్చి హై దరాబాద్ చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఇంతలో హైదరాబాద్ లోని చార్మినార్‌ను చూపిస్తున్న చిత్రం ఒకటి వైరల్ అవుతూ ఉంది. మూసీ నది వరద నీటితో ఆ ప్రాంతం నిండిపోయింది. వరద నీటిలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కొందరు నీటిలో మునిగిపోతున్నారు, మరికొందరు ఈత కొడుతూ ఇబ్బంది పడుతున్నట్లు చూడొచ్చు. నీటి మట్టం ఎక్కువగా ఉంది. ఫ్రేమ్ ఎడమ వైపున కనిపించే చిన్న నిర్మాణాలు, గుడిసెలు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే జరుగుతుందోమేనని జనం భయపడుతున్నారు.
రాష్ట్రం అతలాకుతలమవుతున్న ఈ తరుణంలో, ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ముఖ్యంగా వంతెనలు లేని ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 45ఏళ్ల తర్వాత మూసీ మహోగ్రరూపం దాల్చడంతో నగరవాసులు వణికిపోతున్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజులు అత్యంత కీలకమైనందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకుండా జాగ్రత్త పడాలని విపత్తు నిర్వహణ బృందాలు హెచ్చరిస్తున్నాయి.



