జాతియం

Operation Polo: నిజాం హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక దేశమా?

Operation Polo: ఆపరేషన్ పోలో లేకుంటే హైదరాబాద్ స్టేట్..ప్రత్యేక దేశంగా నిలదొక్కుకునేదా? సైనిక చర్య లేకుంటే నిజాం రాజు- రజాకార్లు కోరుకున్నట్లు తెలంగాణ ముస్లిం దేశంగా అవతరించేదా? కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఖతం చేసేందుకే నాటి ప్రధాని నెహ్రూ హైదరాబాద్ స్టేట్‌పై సర్దార్‌ సైన్యాన్ని ప్రయోగించారా? తెలంగాణ సాయుధ పోరాటం నిజాంను నేలకొరిగిస్తే హైదరాబాద్ స్టేట్ ఇండియాలో అంతర్భాగం ఉండేదా? లేదంటే చైనా కనుసన్నల్లో మెదిలే కమ్యూనిస్ట్ కంట్రీగా అవతరించేదా?

1947, ఆగస్ట్ 15 భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. అయితే హైదరాబాద్ స్టేట్ భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు సెప్టెంబర్17, 1948. మధ్యలో ఏం జరిగింది? నిజాం నవాబు తన హైదరాబాద్ స్టేట్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించారా? హిందువులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ సంస్థానం ముస్లిం రాజ్యంగా ముఖ్యంగా ప్రాక్సీ పాకిస్థాన్‌గా అవతరించేలా జరిగిన కుట్ర వెనక ఎవరెవరు ఉన్నారు? ముస్లిం రాజును ఓడించి కమ్యూనిస్ట్ సామ్రాజ్యాన్ని నిర్మించేలా తెలంగాణ సాయుధ పోరాటం విజృంభించిందా?

వారి ప్రయత్నాలే ఫలిస్తే నాటి హైదరాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ దేశంగా అవతరించేదా? లేదంటే కేరళ, బెంగాల్ మాదిరి ఎర్రజెండా రాష్ట్రంగా దశ దిశ మార్చుకునేదా? ఈ ప్రయత్నాలన్నింటిని ప్రశ్నలుగానే మిగిల్చిన చరిత్ర ఆపరేషన్ పోలోది. హైదరాబాద్ స్టేట్ చరిత్రలో భాగమైన తరాలకు, వారి వారసులకు ఈ విషయాలన్నీ ఎప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటాయి.

స్వాతంత్ర్యం ఇస్తూ పోయిన బ్రిటీషర్లు స్వదేశీ సంస్థానాలకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి భారత్‌లో విలీనమవడం, లేదంటే పాకిస్థాన్‌లో కలవడం. సంస్థానాల్లో హైదరాబాద్ స్టేట్ నాడు బౌగోళికంగా, ఆర్థికంగా మహా సామ్రాజ్యం. మెజార్టీ హిందూ ప్రజలు ఉన్న రాజ్యాన్ని భారత్‌లో కలుపకుండా ప్రత్యేక దేశంగా ప్రకటించారు నిజాం ముస్లిం రాజు.

అయితే భారత దేశం మధ్యలో హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఉంటే ప్రమాదమని భావించిన నెహ్రూ సర్కార్ ఆపరేషన్ పోలోతో బలవంతంగా నిజాం మెడలు వంచి భారత్‌లో విలీనం చేసుకుంది. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నాలుగంటే నాలుగు రోజుల్లో నిజాం లొంగిపోయేలా భారత సర్కార్ బహుముఖ వ్యూహాన్ని అమలుపర్చింది. దీంతో హైదరాబాద్ స్టేట్ భారత్‌లో అంతర్బాగమైంది.

హైదరాబాద్ స్టేట్‌లో తెలంగాణ సాయుధ పోరాటానిది ప్రత్యేక చరిత్ర. భూమి,భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటంలో హిందూ ముస్లిం సాంస్కృతిక వైరుధ్య అస్తిత్వం కూడా ప్రధానమైంది. నిజాం రాజుకు అండగా మజ్లిస్ సంస్థ ఆధ్వర్యంలోని రజాకార్ ఆర్మీ ముస్లిం రాజ్యం కోసం ఆకృత్యాలకు దిగింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ ఆ తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లాల్సివచ్చింది.

మజ్లిస్ సంస్థ రాజకీయ పార్టీగా మారి నేటికి పాతబస్తీలో చక్రం తిప్పుతోంది. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ పల్లెల్లో పట్టు సాధించి నిజాం రాజ్యాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. బ్రిటీషర్ల నుంచి స్వతంత్ర్యం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 13, 1948 వరకు ఒకవిధంగా నేటి తెలంగాణలో అంతర్యుద్ధం జరిగింది.

రజాకార్లు పైచేయి సాధిస్తే ప్రత్యేక ముస్లిం దేశంగా హైదరాబాద్ స్టేట్ నిలిచేదని చరిత్రకారుల అభిప్రాయం. నిజాం రాజు ప్రత్యేక దేశంగా ప్రకటించిన హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టులు ఎర్రజెండా ఎగిరేస్తే ప్రత్యేక కమ్యూనిస్ట్ దేశంగా మిగిలడమో, కమ్యూనిస్టు రాష్ట్రంగా నిలవడమో జరిగేది అనేది తెలంగాణ చరిత్ర కారుల అభిప్రాయం. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల కంటే కాంగ్రెస్ వెనకబడిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.

దేశం నడిబొడ్డులో హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఏర్పడితే భారత్ ఉనికికే ప్రమాదం అని భావించిన కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. అదే సమయంలో కమ్యూనిస్టులు రజాకార్ల సైన్యంపై గెలుపు ముగింట ఉన్నారు. ఈ దశలో కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఎంట్రీతో రాజకీయం, చరిత్ర అంతా మారిపోయాయి. దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం పెరిగిపోకుండా ఉండేందుకు నిజాం రాజును లొంగదీసుకునేందుకు, నెహ్రూ-పటేల్ జోడీ బహుముఖ వ్యూహం ఆచరించారనేది చరిత్రకారుల అంతరంగం.

నిజాంను రాజ్ ప్రముఖ్‌గా చేసి ఆయనకు రక్షణ కల్పించినట్లైందనే విమర్శలు కమ్యూనిస్టుల నుంచి వచ్చాయి. నిజాం ఆస్తులు ప్రజలకు పంచకుండా నాటి కాంగ్రెస్ సర్కార్ అడ్డుపడిందనే ఆరోపణలు కమ్యూనిస్టులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనం కావడంతో కమ్యూనిస్టుల స్థానాన్ని హస్తం పార్టీ చేజిక్కించుకున్నట్లైంది. ఆపరేషన్ పోలో లేకుండా కమ్యూనిస్టులు, రజాకార్లు కొట్టుకుని ఎవరో ఒకరు విజయం సాధిస్తే ఇటు ముస్లిం రాజ్యం కాని అటు కమ్యూనిస్టు దేశంగా కాని హైదరాబాద్ స్టేట్ ఏర్పడేది అనే చర్చ సాయుధ పోరాటాన్ని, తొలి దశ, మలిదశ ఉద్యమాన్ని చూసిన ఉద్యమకారులు అంటుంటారు.

సంఘర్షణ, సంక్షోభం, అంతర్యుద్ధం హైదరాబాద్ స్టేట్‌ ప్రజల బతుకులను చిద్రం చేసింది. నాడు సైనిక చర్య లేకుంటే పరిస్థితి అదుపులోకి వచ్చేది కాదు అనేది చరిత్ర చెప్పే నిజం. అలాగే సర్దార్ పటేల్ నిజాంను లొంగదీసుకోకుంటే హైదరాబాద్ స్టేట్ మన భారతదేశంలో అంతర్భాగం కాకుండా ఉండేదేమో అనే భయం దేశంపై మమకారం ఉండేవారి అంతరంగం.

నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానం నేటి తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలో విస్తరించింది. బొగ్గు గనులు, సజీవ నదులు, మాగాణి భూములు, రైల్వే, విమాన, బస్సు సౌకర్యాలతో అలరాలేది. నేడు దేశానికి ఈ భాగమే ఎక్కువగా ఆర్థిక శక్తిగా నిలుస్తోంది. అలాంటింది హైదరాబాద్ మనదేశంలో అంతర్భాగం కాకుండా సొంత దేశం అనే మాట నేటి తరానికి ఊహకు అందని మాట.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button