Ujjaini Mahankali Bonalu 2025: వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు

Bonalu 2025: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర షురూ అయింది. బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బోనాలు, తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపు ప్రారంభమైంది. రేపు రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురిటీ కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఉదయం 10గంటల 30నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
2వేల 500మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వీటిని మహంకాళి పోలీస్‌స్టేషన్‌లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఆలయం చుట్టూ 2కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బయో మొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు.