Rain: మరో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. నేడు తెలంగాణలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.



