ఆంధ్ర ప్రదేశ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వారం రోజుల పాటు వర్షాలు

Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో రాబోయే వారంరోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 25న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 26న బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఈనెల 27న దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మధ్య ప్రాంతాన్ని దాటే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాలోని పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈశాన్య గాలులు వీచే అవకాశముందని తెలిపింది. తీర ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.



