హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలో వర్షాల రౌద్రం కొనసాగుతోంది. తెల్లవారుజామునుంచే హైదరాబాద్ నగరం కుండపోత వర్షాలతో తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో నీరు నిలిచి రహదారులు జలమయం అయ్యాయి. ఇదే క్రమంలో రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించగా, రేపటికీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ‘ఎల్లో అలర్ట్’ కూడా జారీ చేసింది.
మొంథా తుపాను ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలు భారీ వర్షాల ముప్పులో ఉన్నాయని అంచనా. కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 180 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లోనూ రోజు మొత్తం మోస్తరు వర్షాలు పడతాయని, బలమైన గాలులు వీచే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు.



