జాతియం

Cyclone Ditva: శ్రీలంకలో దిత్వా తుపాను బీభత్సం.. 123 మంది మృతి

Cyclone Ditva: పర్యాటకులు ముత్యాల ద్వీపంగా పిలిచే ఆ దేశం, ఈ వారం ప్రకృతికోపానికి విలవిలలాడిపోయింది. దిత్వా తుఫాను దేశాన్ని చుట్టుముట్టడంతో కుండపోత వర్షాలు, వరదలు, నేలచరియలు కలగలిపి ప్రజలకు నరకాన్ని చూపించింది. ప్రజల ఆలోచనలన్నీ ఒక్క తుపానుతో ఆవిరైపోయాయి. తుఫాను వినాశనంతో ఇప్పటివరకు 123 మంది మరణించారని శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది.

ఇంకా 130 మంది కనిపించడం లేదని పేర్కొంది. ఇది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదని, ఇది ఈ దశాబ్దంలో శ్రీలంక ఎదుర్కొన్న అత్యంత ఘోర వరదల్లో ఒకటని ప్రభుత్వం చెబుతోంది. రికార్డు స్థాయి వర్షం, నీటిమట్టం పెరగడం, ఒక్కసారిగా వచ్చిన వరదలు ప్రజలను చుట్టుముట్టాయి. ఇళ్లంతా నీళ్లు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఎక్కడికి వెళ్లాలో తెలియని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. వేలాది ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రైతులు పంటలు నష్టపోయారు. రోడ్లు చెదిరిపోయాయి. గ్రామాలు విలయంలో చిక్కుకుపోయాయి. లక్షలాది మంది ఇళ్ళను కోల్పోయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో నివసిస్తున్నారు. సహాయక శిబిరాల్లో కనీసం నీళ్లు లేక, మందులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కెలాని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీప ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు స్థానికులను హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి మరో రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.

వరదల విలయంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేందుకు ఇండియా తక్షణ సాయంగా ఆహార పదార్థాలను. మందులను పంపించింది. శనివారం తెల్లవారుజామునే సహాయ సామాగ్రితో కూడిన విమానం కొలంబోలో దిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అవసరం మేరకు సహాయాన్ని, బృందాలను పంపుతామని హామీ ఇచ్చారు. శ్రీలంకలో గత దశాబ్దాల్లో ప్రకృతి వైపరీత్యాలు కొత్తవి కావు.

2003 వరదల్లో 254 మంది మృతి చెందగా, 2016లో 71 మంది మరణించారు. 2023లో వర్షాలకు 26 మంది బలైపోయారు. తాజా వరదలతో ప్రాణ నష్టం కూడా భారీగా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, సముద్ర ఉష్ణోగ్రత పెరుగుదల ఇవన్నీ కలిసి దిత్వా తుఫానును శక్తివంతం చేశాయంటున్నారు నిపుణులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button