Gummidi Sandhya Rani: ప్రెస్మీట్లో తీవ్ర భావోద్వేగానికి లోనైన మంత్రి సంధ్యారాణి

Gummidi Sandhya Rani: ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రెస్ మీట్లో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యులు, పీఏపై గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలను గుర్తు చేసుకుంటూ ఆమె కంటతడి పెట్టారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ప్రత్యర్థులు ఇలాంటి నీచమైన ఆరోపణలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఒక మహిళా మంత్రిగా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు కుట్రలు పన్నారని వాపోయారు. వాస్తవాలను తెలుసుకోకుండానే నిరాధారమైన ఆరోపణలు చేయడం తనను ఎంతో కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుమారుడు, పీఏ సతీష్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కుట్రపూరితంగా ఫేక్ స్క్రీన్ షాట్లు సృష్టించి తప్పుడు ఆరోపణలు చేసిన వారిని ఇప్పటికే గుర్తించారని సంధ్యారాణి తెలిపారు. వాస్తవాలు నిరూపణ కావడంతో తనపై బురదజల్లిన వారందరిపై త్వరలోనే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.



