తెలంగాణ
నేటి నుంచే గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం

తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతోంది. మొదటి దశలో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. వెంటనే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది. నవంబర్ 29 వరకు వీటిని స్వీకరిస్తారు. నవంబర్ 30న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు.
డిసెంబర్ 2న ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఉప సర్పంచి ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది.



