Gold Rate: బంగారం ఆల్ టైమ్ రికార్డు.. తులం రూ.1,20,000

Gold Rate: బంగారం ధర మరోసారి ఆల్‌టైం హై కి చేరింది. పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష రూపాయల 20 వేలకు చేరువైంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే 40శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే, అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు.
గత ఐదు సంవత్సరాలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. దీనికి కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ, అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి. ప్రస్తుతం, ఈక్విటీ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 ఇండెక్స్ గత సంవత్సరంలో దాదాపు సున్నా రాబడిని అందించింది. ఈక్విటీ మార్కెట్లు బలమైన రాబడిని అందించడంలో విఫలమైనప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం, గత సంవత్సరంలో బంగారు ఇటిఎఫ్‌లు 47% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి.
బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. దీనికి తోడు సుంకాల ఆందోళనలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ కారణాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరలు వచ్చే ఏడాదిలో ఔన్సుకు 4,000 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 3 లక్షల 40 వేలుపై మాటే ఉంటుంది. తులం బంగారం లక్ష ఇరవై వేలకు చేరువైతేనే బెంబేలెత్తుతున్న సామాన్యులకు భవిష్యత్ అంచనాలు మరింత కలవరం కలిగిస్తున్నాయి.
మొత్తం మీద బంగారం విషయంలో మన పెద్దలు చెప్పిన మాటలు మరోసారి నిజమౌతున్నాయి. ఎప్పటికైనా బంగారం కొనిపెట్టుకుంటే.. చెడ్డవారెవరూ లేరనేది తేలిపోతోంది. బంగారాన్ని ప్రస్తుత గణాంకాలు, రాబడుల ఆధారంగా ప్రపంచం సురక్షిత పెట్టుబడి సాధనమేనని నమ్మొచ్చేమోకానీ భారతీయులకు ఈ గణాంకాలతో పనిలేని మాట నిజం. మనకు మొదట్నుంచీ పుత్తడిపై బలమైన నమ్మకం ఉంది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా పేద, ధనిక అంతరాలు లేకుండా అందరూ తమకు ఉన్నంతలో ఎంతోకొంత పసిడి నిల్వలు పెంచుకోవాలనే చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మన జీవన విధానంలో భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు.



