Gold Rate: రూ.లక్షా 30 వేలు దాటిన బంగారం ధర

Gold Rate: బంగారం మన సంప్రదాయం, మన భరోసా. ఒకప్పుడు ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ చిన్నచిన్న బంగారు గాజులు, తాలి బొట్లు తప్పక ఉండేవి. అత్యవసరానికి ఉపయోగపడతాయని వాటిని దాచుకునేవారు. ఆ పసిడి, ఇప్పుడు కేవలం కలగా మారితోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఎగబాకుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర అక్షరాలా లక్షా ముప్పై వేల రూపాయల మార్క్‌ను తాకింది.
కొంతమంది నిపుణుల అంచనా ప్రకారం ఈ వేగం కొనసాగితే, త్వరలోనే అదే లక్షా యాభై వేల రూపాయలను చేరడం ఖాయం. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు, ట్రంప్ సుంకాల నిర్ణయాలు, యుద్ధ భయాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అన్నీ కలిసివచ్చి ప్రపంచ సెంట్రల్ బ్యాంకులను బంగారం వైపు తిప్పేశాయి. దేశాల మధ్య అనిశ్చితి పెరుగుతున్న కొద్దీ, బంగారంపైనే భరోసా పెరుగుతోంది. అందుకే గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు గడచిన రెండేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి.
2012–13లోనూ ఇదే పరిస్థితి వచ్చింది. ఆ సమయానికీ బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. కానీ తర్వాత స్టాక్ మార్కెట్లు ఊపందుకోవడంతో, ప్రజలు బంగారం అమ్మేసి షేర్ల వైపు పరుగెత్తారు. దీని ఫలితంగా ఒక్కసారిగా 22–25 శాతం వరకు బంగారం ధర క్షీణించింది. నిపుణులలో కొందరు అదే రిపీట్ అవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లు మళ్లీ బలపడితే, ఈసారి కూడా బంగారంపై కరెక్షన్ రావడం ఖాయమంటున్నారు.
ప్రస్తుతానికి మాత్రం పసిడి జోరు తగ్గేలా కనబడడం లేదు. స్టాక్స్ కంటే బంగారమే సేఫ్ అనే భావన పెట్టుబడిదారులలో బలంగా ఉంది. ఆ సెంటిమెంట్ ఇలానే కొనసాగితే, 10 గ్రాముల బంగారం లక్షా యాభై వేల రూపాయలు అవడం కేవలం సమయమే అనిపిస్తోంది. పసిడి పట్ల మన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కానీ ఒకప్పుడు భరోసాగా నిలిచిన బంగారం, ఇప్పుడు భారంగా మారే ప్రమాదం ఉంది. మార్కెట్ల పట్ల, ప్రపంచ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండే సమయం ఇది. ఎందుకంటే, పసిడి పరుగు ఎక్కడ ఆగుతుందో… ఎవరికీ తెలియదు! రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఒకప్పుడు మధ్యతరగతి కొనుగోలు చేసే ఆభరణం ఇప్పుడు ధనవంతులకే భారంగా మారింది. చైనా, జపాన్ వంటి దేశాలు బంగారం నిల్వలు పెంచుతుండటంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. స్టాక్స్ బలపడితే బంగారం తప్పనిసరిగా కరెక్షన్ ఎదుర్కొంటుందన్న మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైతే స్టాక్స్ కంటే బంగారమే సేఫ్ అన్న భావన బలంగా ఉంది. కానీ నిపుణుల మాత్రంఒకేసారి బంగారంపైనే పెట్టుబడి పెట్టొద్దంటున్నారు. మార్కెట్ కదలికల్ని గమనించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఈ పసిడి పరుగు ఎక్కడ ఆగుతుందో, ఎప్పుడు బ్రేక్ పడుతుందో చెప్పడం కష్టమన్న అభిప్రాయం ఉంది.



