Girija Oak: కొడుకు చూస్తాడని గిరిజా ఆవేదన!

Girija Oak: మరాఠీ నటి గిరిజా ఓక్ సోషల్ మీడియాలో అకస్మాత్తుగా వైరల్ అయింది. ఆమెకు వస్తున్న ఆదరణతో పాటు మార్ఫింగ్ ఫోటోలు బాధ కలిగిస్తున్నాయి. 12 ఏళ్ల కుమారుడు చూస్తే ఏమవుతుందని ఆందోళన చెందుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
హిందీ, మరాఠీ, కన్నడ చిత్రాల్లో నటించిన గిరిజా ఓక్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నాయి. ఈ ఆకస్మిక ఆదరణపై గిరిజా సంతోషం వ్యక్తం చేస్తూనే కొన్ని బాధలు కూడా పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు వస్తున్న ప్రేమ, కాల్స్, మెసేజ్‌లు చూసి ఆనందంగా ఉంది. కొన్ని మీమ్స్ సరదాగా ఉన్నాయి. కానీ ఏఐతో నా ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేస్తున్నారు.
అవి చూడటానికే ఇబ్బందిగా ఉంటున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నాకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇప్పట్లో సోషల్ మీడియా వాడడు కానీ రేపు వాడు చూస్తే.. ‘అమ్మ ఫొటోలు ఇలా ఎందుకు ఉన్నాయి?’ అని బాధపడతాడు. అదే ఆలోచన నన్ను కలవరపెడుతోంది’’ అని గిరిజా బాధను పంచుకుంది. వ్యూస్ కోసం చీప్ ట్రిక్స్ మానుకోవాలని, ఎవరి ఫొటోలనైనా ఇలా ఎడిట్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించాలని కోరింది. అయినా ఈ పాపులారిటీ వల్ల తన సినిమాలు, సిరీస్‌లు మరింత మంది చూస్తే చాలు అంటూ సంతృప్తి వ్యక్తం చేసింది.



