వ్యాపారం

దేశవ్యాప్తంగా ఇవాళ గిగ్ వర్కర్ల సమ్మె

కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్‌ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. దీంతో దేశరాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి.

జోమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది. సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెకు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్, ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని గిగ్‌ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి.

కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఇవాళ భారీ ఆర్డర్‌లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్‌, గ్రాసెసరీల ఆర్డర్లు ఎక్కువగా ఉండే ఛాన్స్‌ ఉంది. అయితే సమ్మె నేపథ్యంలో ఆ సేవలకు విఘాతం కలగనుంది. పుణె, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాతో పాటు టైర్ 2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్‌ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. సమ్మె కారణంగా హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌ ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు.. ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకూ తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యోగంతో జాబ్‌ గ్యారెంటీ లేదు, భద్రతతోపాటు గౌరవం కూడా లేదని గిగ్‌ వర్కర్లు వాపోతున్నారు. విరామం లేకుండా పనిచేస్తున్న తమకు న్యాయమైన జీతంతో పాటు కమీషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్‌ను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.

ఈ డిమాండ్లతో క్రిస్మస్ రోజునే దాదాపు 40వేల మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా దాదాపు 50 శాతం డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా లక్షా 50వేల మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదను చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మెబాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతోంది. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానున్నాయి. అలాగే సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్‌–మైల్‌ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button