Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష

Sheikh Hasina: షేక్ హసీనా మరణదండన, బంగ్లాదేశ్ రాజకీయాల్లో సునామీకి కారణమయ్యేలా కన్పిస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మానవత్వానికి మచ్చ కలిగించేలా నేరాలు చేసినందుకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఈ పరిణామం దక్షిణాసియా రాజకీయాలను కుదిపేస్తోంది. గతేడాది జరిగిన విద్యార్థుల భారీ తిరుగుబాటును అణచివేయడానికి హసీనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
దీనిపై ట్రిబ్యునల్ సుదీర్ఘకాలం విచారించి తీర్పు ఇచ్చింది. హసీనామాపై ట్రిబ్యునల్ తీర్పు, దేశ–విదేశాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జూలై 15 నుంచి ఆగస్టు 15 2024 మధ్య జరిగిన జూలై తిరుగుబాటులో సుమారు 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. ఆ కాలంలో ప్రభుత్వం భద్రతా దళాలను నిరసనకారులపై ప్రాణాలను లెక్క చేయకుండా దాడులు చేసినట్టు విచారణలో తేలింది.
జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మజుందార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీసు చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌ను దోషులుగా తేల్చింది. నిరసనకారులను నిర్మూలించాలని హసీనా ఇచ్చిన ఆదేశాలపైనే ట్రిబ్యునల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మామున్ విచారణ సమయంలో అప్రూవర్‌గా మారగా, హసీనా, కమల్ గైర్హాజరీలో కేసు విచారణ జరిగింది. ఇద్దరినీ పారిపోయిన నిందితులుగా కోర్టు ప్రకటించింది.
విద్యార్థుల ఉద్యమాన్ని దేశద్రోహంగా చిత్రీకరించి, ప్రేరేపించే ప్రసంగాలు ఇచ్చి, భద్రతా దళాలకు కాల్పుల ఆదేశాలు జారీ చేసిందని హసీనా సర్కారుపై ప్రధాన అభియోగాలు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్ ఈ చర్యలను రాష్ట్రాధిపత్య దుర్వినియోగానికి అత్యంత ఘోర ఉదాహరణగా వర్ణించింది. చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు. హసీనా ఈ దారుణాలకు సూత్రధారి అని, ప్రధాన రూపశిల్పి అని పేర్కొన్నారు.
అయితే, అవామీ లీగ్‌కు చెందిన నేతలు, ప్రవాసంలో ఉన్న అనుచరులు ఈ కేసును రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించారు. 2024 ఆగస్టు 4న హసీనా దేశం విడిచి భారత్‌కు చేరుకున్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి కమల్ కూడా భారతదేశంలో ఉన్నారని తెలుస్తోంది. తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నాయకత్వంలోని ఢాకా ప్రభుత్వం ఇప్పటికే హసీనా అప్పగింత కోరింది. అయితే ఢిల్లీ ఇప్పటివరకు అధికారిక స్పందించలేదు. ఇది రెండు దేశాల దౌత్య సంబంధాలలో కొత్త ఉద్వేగాన్ని సృష్టిస్తోంది. తీర్పు వెలువడే రోజున ఢాకా సహా ముఖ్య నగరాలు దాదాపు సైనిక శిబిరాల్లా మారాయి.
ఆర్మీ దళాలు, పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. తీర్పు ఇచ్చిన ఐసిటి కాంప్లెక్స్ చుట్టూ బలగాలు మోహరించారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు మరింత ఆందోళన కలిగించాయి. పోలీసులకు లేదా పౌరులకు హాని చేసే ఎవరిపైనైనా కాల్పులు జరపడానికి ఆయన అనుమతిచ్చాడు. ఇదే సమయంలో, రద్దు చేసిన అవామీ లీగ్ రెండు రోజుల బంద్‌నకు పిలుపునిస్తూ ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ తీర్పు కేవలం బంగ్లాదేశ్ రాజకీయాలకే కాదు, భారత్–బంగ్లాదేశ్ సంబంధాలకు కూడా కీలక మలుపుగా చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీ ఇప్పటికే బంగ్లాదేశ్ NSA ఖలీలుర్ రెహ్మాన్‌ను CSC సమావేశానికి ఆహ్వానించిన నేపథ్యంలో, ఈ తీర్పు రెండు దేశాల మధ్య కొత్త చర్చలను తెరపైకి తీసుకురావచ్చు.



