Harish Rao: ఫలించిన హరీశ్ రావు కృషి.. సొంతూళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు

Harish Rao: ఫలించిన హరీశ్ రావు కృషి సొంతూళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులుబీఆర్ఎస్ నేత, మాజి మంత్రి హరీష్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. జోర్డాన్లో పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు, రవాణ ఖర్చును భరించి వలస కార్మికులను తెలంగాణాకు తీసుకొచ్చారు హరీష్ రావు. శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జోర్డాన్‌లో అనేక కష్టాలు అనుభవించిన తమను ఆదుకొని స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని హరీష్ రావును కొనియాడారు వలస కార్మికులు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికి పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల దృష్టికి తమ సమస్యలను విన్నవించుకున్న ఎవరూ స్పందించలేదన్నారు. తమను తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చిన బీఆర్ఎస్ రుణం ఎప్పటికి తీర్చుకోలేమన్నారు. ఇక జోర్డాన్‌లో కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు.
కడుపు నిండా తిండి కూడా లేకుండా ఉన్నామని ఎన్నో బాధలు అనుభవించామని కార్మికులు హరీష్ రావు ఎదుట కంట నీరు పెట్టుకోగా వారికి ధైర్యం చెప్పి ఇక్కడే ఉపాధి, ఉద్యోగ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర వీడాలని విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెట్టి వారికోసం ప్రత్యేక పాలసీ తెస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. రెండు ఏళ్లు అయిన ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు మనకి అధికారం కట్టబెట్టింది ఆపదలో ఉన్న ప్రజలని కాపాడుకోవడానికే అని అన్నారు.



