ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఈ స్టాంపుల కుంభకోణం తుస్సుమందా..?

ఏపీలో ఈ స్టాంపుల కుంభకోణం తుస్సుమందా..? అంతా ఇంతా అని.. చివరికి ఏమీ లేదని తేల్చారా..? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. గత వారం రోజులుగా జరుగుతున్న అనేక ప్రచారాలను ఖండించారు పోలీసులు. ఈ స్టాంపుల కుంభకోణంలో మీసేవ బాబునే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. మరి.. స్టాంపుల కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత..? దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నారా..? లేదా ఇదంతా కోవర్ట్ రాజకీయమా..? ప్లాన్ ప్రకారమే మీసేవ బాబు చేశారా..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ స్టాంపుల కుంభకోణం పెద్ద వివాదానికి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది ఈ స్టాంపుల ట్యాంపరింగ్. ఈ-స్టాంపుల కుంభకోణాన్ని అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. కళ్యాణదుర్గంకు చెందిన ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. S.R.C కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో నకిలీ ఈ స్టాంప్ బాగోతం బయటపడిందని తెలిపారు.

కళ్యాణదుర్గంలో మీ సేవ సెంటర్ నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు బోయ ఎర్రప్ప ఇప్పటి వరకు దాదాపు 15 వేల 851 ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించామన్నారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వంద రూపాయల ఈ స్టాంపులను కొనుగోలు చేసి ఫొటోషాప్‌లో లక్ష రూపాయల నకిలీ ఈ స్టాంపులుగా నిందితుడు మీసేవ బాబు మార్చాడని పేర్కొన్నారు.

ఇప్పటివరకు అంత బాగానే ఉన్నా ఈ స్టాంపుల కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నది ఎమ్మెల్యే సురేంద్రబాబు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన S.R.C ఇన్‌ఫ్రా కంపెనీ వారు.. చాలా కాలంగా మీ సేవ బాబు వద్దే ఈ స్టాంపులు కొనుగోలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా 900 కోట్ల రుణం కోసం కూడా వారు ఈ స్టాంపులు కొనుగోలు చేశారు.

అందుకు సంబంధించిన స్టాంపు డ్యూటీ చెల్లించిన వివరాలు బయటపెట్టాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉంది కాబట్టే వారు ఆ వివరాలు బయటకు వెల్లడించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. మీ సేవ బాబుతో సురేంద్రబాబుకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నారు.

మరోవైపు వైసీపీ నేతలతో సైతం మీసేవ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక యూట్యూబర్‌గా మీసేవ బాబు తనకు పరిచయమయ్యారన్నారు సురేంద్ర బాబు. తనతో ఫోటోలు దిగినంత మాత్రాన.. ఎవరెవరో చేసే అక్రమాలతో తనకు సంబంధం ఉందని చెప్పడం అర్ధరహితం అన్నారు.

తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంపును మీడియాకు చూపించారని కుట్రలో భాగస్వాములు కాకపోతే ఆ పేపరు వారికి ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు. మొత్తం మీద నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం రాజకీయ రంగు పులుముకుంది. ఏసీబీ, సిట్, సీబీఐ వంటి ఏ విచారణ సంస్థతోనైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని దమ్ముంటే నిరూపించాలని సురేంద్రబాబు సవాల్ విసిరారు. MLA అమిలినేని సురేంద్రబాబు సవాల్‌కు ఇంతవరకు వైసీపీ ఇంచార్జ్ రంగయ్యతో సహా ఎవరూ స్పందించలేదు.

మొత్తానికి ఏపీలో ఈ స్టాంపుల కుంభకోణంపై ఎంతో రచ్చ జరిగితే.. చివరకు ఇందులో ప్రధాన సూత్రధారి కేవలం మీసేవ బాబు, అతని అనుచరులు మాత్రమేనని పోలీసులు తేల్చారు. దీంతో ఇన్నాళ్లు ఆరోపణలు చేసిన వైసీపీ శ్రేణుల నోళ్లు మూతపడ్డాయని ఎమ్మెల్యే అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్టాంపుల కుంభకోణంలో పోలీసులు చెప్తున్నట్లుగా మీసేవ బాబునే ప్రధాన సూత్రధారా..! లేదంటే మీసేవ బాబు వెనుక ఎవరైనా ఉన్నారా..! ఏమో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button