Donald Trump: భారత్‌పై ట్రంప్ మళ్లీ కీలక వ్యాఖ్యలు

Donald Trump: భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్- అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈక్రమంలో భారత్‌తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో కలిసి ఉన్నామంటూనే తమపై భారీగా సుంకాలు విధిస్తుందంటూ ఆరోపణలు చేశారు.
తాము భారత్‌తో కలిసే ఉన్నామన్నారు. ఇరుదేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను అధికారం చేపట్టిన తర్వాత అందులో మార్పు వచ్చిందన్నారు. ఈసందర్భంగా యూఎస్ దిగుమతులపై భారత్ పెద్దఎత్తున సుంకాలు వసూలుచేస్తోందని ఆరోపించారు. అవి ప్రపంచంలోనే అత్యధికమన్నారు. తాము భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు కానీ, వారు మాతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా భారత్‌పై విధించిన సుంకాలను ఆయన సమర్థించుకున్నారు.
భారత్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికా తయారీదారులకు భారీగా నష్టం జరుగుతుందని ట్రంప్ ఆరోపించారు. భారత్ ఉత్పత్తులు యూఎస్‌లో భారీగా దిగుమతి అవుతున్నాయన్నారు. కానీ, మన వస్తువులపై 100 శాతం సుంకాలు వసూలుచేస్తుండటంతో యూఎస్ ఉత్పత్తులు తక్కువగా ఎగుమతి చేస్తున్నామన్నారు. భారత్ సుంకాల విధానం కారణంగా అమెరికా కంపెనీలు బయటకు వెళ్లి నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు.
ఈసందర్భంగా హార్లే డేవిడ్‌సన్ మోటార్ సైకిళ్ల గురించి ప్రస్తావించారు. అధిక సుంకాల కారణంగా ఆ సంస్థ.. భారత్‌లో ప్లాంట్‌ను నిర్మించి విక్రయాలు జరపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈక్రమంలోనే తన విధానాల వల్ల వేలాది కంపెనీలు యూఎస్‌లోకి తరలివస్తున్నాయన్నారు. చైనా, మెక్సికో, కెనడా దేశాలకు చెందిన పలు కార్ల కంపెనీలు తమ దేశంలోకి వస్తున్నాయన్నారు.
అనారోగ్యం వదంతులపై క్లారిటీ.
ఇటీవల ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో హాజరుకాకపోవడంతో ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ.. అవన్నీ ఫేక్ న్యూస్‌లని కొట్టిపడేశారు. తన ఆరోగ్యంపై వచ్చిన వదంతుల గురించి విన్నానని, అయితే.. అవన్నీ ఫేక్ న్యూస్‌లని ట్రంప్ స్పష్టం చేశారు.



