Donald Trump: ట్రంప్ దెబ్బకు డెలి‘వర్రీ’..నెలలు నిండకముందే సిజేరియన్లు..
Donald Trump: ముందే వచ్చిన పురిటినొప్పులు.. నెలలు నిండకుండానే అమెరికాలో కాన్పులు.. ఆస్పత్రులకు పరుగులు.. ఇప్పుడిదే అగ్రరాజ్యంలో ట్రెండ్. మొత్తానికి ట్రంప్ దెబ్బతో అమెరికాలో కడుపుకోత మిగులుతోంది. ఫి బ్రవరి 20లోపు పుట్టినవారికే అమెరికా పౌరసత్వం వర్తిస్తుందన్న ట్రంప్ నిర్ణయంతో.. ఆస్పత్రులకు దంపతులు క్యూ కడుతున్నారు. నెలలు నిండకముందే సిజేరియన్లు చేపించుకుంటున్నారు. ముఖ్యంగా పౌరసత్వం అంశం తల్లిదండ్రుల్లో ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 20వ తేదీ లోపు డెలివరీలకు పేరెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్.. మరుక్షణమే తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాడు. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ ఈ నెల 20న ఆదేశం జారీ చేశాడు. ఉత్తర్వులు జారీ అయిన నెల రోజుల తర్వాత అమల్లోకొస్తుంది.
అంటే గడువు తేదీ ఫిబ్రవరి 20. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న దంపతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో ఫిబ్రవరి 20లోపే.. గర్భిణులు నెలలు నిండక మునుపే.. సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు దంపతులు తొందరపడుతున్నారు. డెలి‘వర్రీ’తో ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు.