ట్రంప్-పుతిన్‌ల సమావేశం రద్దు

వాళ్లిద్దరూ బావా బామ్మర్దులంత క్లోజ్. బయటకు కన్పించనంత ఘాటు రిలేషన్ వారిది. బంధుత్వం, స్నేహం అన్నీ లేకున్నా వారి రిలేషన్ మాత్రం డీప్ సీక్ అంత ఘాడమైంది. ఇద్దరూ ఏమైనా చేసుకోగలిగినంత క్లోజ్. కానీ అంతలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పుతిన్ నీతో మాట్లాడటానికి నాకు టైమ్ లేదు బ్రదర్ అంటూ కుండబద్దలుకొట్టేశాడు ట్రంప్. త్వరలో జరగనున్న సమావేశంతో టైమ్ వేస్ట్ తప్ప ఒరిగేదేం లేదన్నాడు.
అందుకే తాను పుతిన్‌తో సమావేశాన్ని రద్దు చేసుకొని చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌తో భేటీ కాబోతున్నానన్నాడు. దీంతో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కొత్త మలుపు తీసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరగాల్సిన కీలక సమావేశాన్ని ట్రంప్ రద్దు చేసుకోవడం కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
వృధాగా పుతిన్‌తో సమావేశం కావాలనుకోవడం లేదని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి పరిష్కారం కనుగొనే దిశగా పుతిన్‌తో చర్చించాలని ట్రంప్ భావించినప్పటికీ, దౌత్యపరంగా ఎలాంటి పురోగతి కనబడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దౌత్యం పేరుతో పుతిన్ టైమ్ పాస్ చేస్తున్నారని యూరోపియన్ దేశాలు ఆరోపిస్తుండగా, ట్రంప్ ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించాడు.
ట్రంప్ ఆగస్టులో అలాస్కాలో పుతిన్‌ను చివరిసారిగా కలిశాడు. ఆ భేటీ తరువాత కూడా యుద్ధ పరిష్కారానికి ఎటువంటి మార్గం దొరకకపోవడంతో అమెరికా-రష్యా మధ్య చర్చలు నిలిచిపోయాయి. అయితే ఈసారి ట్రంప్‌తో చర్చల కోసం సీరియస్ ప్రిపరేషన్ అవసరమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించాడు.
ఓవైపు పుతిన్ సమావేశాన్ని రద్దు చేసుకున్న ట్రంప్ ఆసియా పర్యటనను ప్రకటించారు. మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లకు వెళ్లే ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేక సమావేశమవుతున్నాన్నాడు. జిన్‌పింగ్‌తో తాను ప్రత్యేక చర్చలు నిర్వహించబోతున్నానన్నాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇంధనం, చమురు అంశాలను చర్చిస్తానన్నాడు. యుద్ధాన్ని ఎలా ముగించాలనే అంశం విషయంలో చైనాకు క్లారిటీ ఉండొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డాడు.
జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడిపై పెద్ద ప్రభావం చూపగలడన్నాడు. చైనా అధ్యక్షుడు ప్రపంచంలోనే గౌరవనీయుడని, శక్తివంతమైన నాయకుడని ఆయన ప్రభావంతో శాంతి సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నంటూ ఒక్కసారికి జీని ఆకాశానికెత్తేశాడు. నిన్నటి వరకు చైనాపై ఆంక్షలు అలా ఇలా వేస్తానంటూ సొల్లు మాటలు చెప్పిన ట్రంప్ తాజాగా ఆయనను ఇంద్రుడు, చంద్రుడని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.
ఇక రష్యా మాత్రం యుద్ధ విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ మాట్లాడుతూ, అలాస్కాలో ఇద్దరు అధ్యక్షులు అంగీకరించిన దానికి విరుద్ధంగా కాల్పుల విరమణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నాడు. రష్యా ఉక్రెయిన్‌లో ఐదో వంతు భూభాగాన్ని ఆక్రమించి ఉండగా, ఉక్రెయిన్ అధికారులు దేశాన్ని విభజించడమన్నది తమకు అస్సలు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెబుతున్నారు.
చర్చల పేరుతో పుతిన్‌కు తమను దెబ్బకొట్టాలని చూస్తున్నాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శిస్తున్నాడు. శాంతి పేరుతో ఉక్రెయిన్ భూమిని రష్యాకు ధారాదత్తం చేయడం తమకు ఆమోదయోగ్యం కాదని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో జరగనున్న ఏపెక్ శిఖరాగ్ర సమావేశం కీలకంగా మారింది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 1 వరకు జియోంగ్జులో జరగనున్న ఈ సమ్మిట్‌లో ట్రంప్–జిన్‌పింగ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.



