అంతర్జాతీయం

Donald Trump: భారత్‌పై అమెరికా 25 శాతం ప్రతీకార సుంకాలు

Donald Trump: రష్యాతో వాణిజ్యం చేస్తోన్న దేశాలు ముఖ్యంగా చైనా, భారత్‌లపై ట్రంప్ ప్రతీకార సుంకాలతో బెదిరింపులకు దిగారు. దీనిపై భారత్ తెలివిగా స్పందించింది. మాస్కో నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంపై వాషింగ్టన్ అసహనం వ్యక్తం చేసింది. అయితే, మా అవసరాలు, పరిస్థితులను బట్టే నిర్ణయాలు ఉంటాయని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది. దాయాది పాక్‌తో ఒప్పందం తెరపైకి తీసుకొచ్చి అమెరికా ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తుంది. అయితే భారత్ మాత్రం ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోంది.

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించాయి అయినప్పటికీ మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. దీనిపై న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తున్నప్పటికీ దీన్ని ఓ కారణంగా చూపుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై పెనాల్టీలు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్తలు వస్తున్నాయి.

భారత్‌కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలు గత వారం రోజులుగా మాస్కో నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి.

అయితే, దీనిపై ఆయా సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి స్పందించారు. ఇప్పటివరకు అలాంటి ఆదేశాలేమీ ప్రభుత్వం జారీ చేయలేదని ఆయన వెల్లడించారు.

ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. దీంతో ఆర్థిక వ్యవస్థ సవాళ్లను దృష్టిలోపెట్టుకొని రష్యా నుంచి డిస్కౌంట్‌ ధరకు ముడి చమురు ధరను భారత్ కొనుగోలు చేస్తోంది. భారత్‌కు వస్తున్న మొత్తం ఇంధన సరఫరాలో దాదాపు 35శాతం మాస్కో చమురే. అయితే, దీనిపై అమెరికా సహా పలు పశ్చిమదేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

భారత్‌ కొంటున్న చమురుతోనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా కొనసాగించగలుగుతోందని, ఇదే న్యూఢిల్లీతో వాణిజ్య చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో అన్నారు. ఇటీవల ట్రంప్‌ కూడా దీనిపై మాట్లాడుతూ రష్యాతో వాణిజ్యం కారణంగా భారత్‌పై 25శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంటున్న చమురుపై ట్రంప్‌ స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇది మంచి చర్య.. భారత్‌ సరైన నిర్ణయం తీసుకుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని నేను అనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, నేను విన్నది సరైందో కాదో నాకు తెలియదు. భారత్‌ కనుక ఇలా చేస్తే అది మంచి నిర్ణయం. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో కేంద్రం తెలివిగా ప్రతిస్పందించింది. మా ఇంధన అవసరాలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన విమర్శలకు భారత్ కౌంటర్ ఇచ్చినట్టయ్యింది. భారత్‌– అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద కోసం చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అసహనం కలిగించే అంశమని రూబియో వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్ని దేశాలు అందుబాటులో ఉన్నా, ఇంకా రష్యా నుంచే భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది ఉక్రెయిన్‌పై మాస్కో కొనసాగిస్తోన్న యుద్ధానికి మద్దతు ఇవ్వడమే అని ట్రంప్ ఆరోపించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత చమురు దిగుమతుల్లో 35 శాతం రష్యా నుంచే వచ్చాయని ట్రంప్ అన్నారు.

అమెరికా నుంచే చమురు కొనుగోలు చేయాలని ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు. ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించడంతో పాటు రష్యా నుంచి ఆయిల్, ఆయుధాల కొనుగోలు చేసినందుకు ఇది జరిమానా అని అన్నారు.

విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం ఆయిల్ కొనుగోలు ఆర్ధిక నిర్ణయమని స్పష్టం చేశారు., ఎవరైనా సరే తక్కువ ధరకు ఇస్తే, వాళ్లనుంచే కొనుగోలు చేస్తామని వ్యాఖ్యానించారు. కాగా, ఉక్రెయిన్‌తో సంఘర్షణకు రష్యా నుంచి భారత్ చాలా తక్కువ మొత్తం చమురు దిగుమతి చేసుకునేది. కానీ, 2023 నాటికి రష్యా రోజుకి 1.66 మిలియన్ బ్యారెల్స్ చమురు భారత్‌కు సరఫరా చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ట్రంప్ భేటీలో అమెరికా నుంచి చమురు, గ్యాస్ మొత్తంలో కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, భారత్‌కు రోజుకు 6.6 మిలియన్ బ్యారెల్స్ చమురు అవసరం ఉంటుంది. ఈ డిమాండ్ తగ్గట్టు సరఫరా జరగాలంటే ఒక్క దేశం నుంచి దిగుమతి చేసుకుంటే సరిపోదు. ప్రస్తుతం భారత్ చమురు దిగుమతుల్లో ఇరాక్, సౌదీ అరేబియా, రష్యా మొదటి స్థానంలో ఉన్నాయి.

మరోవైపు, దాయాది పాకిస్థాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా పాక్‌లో అమెరికా పెట్టుబడులు పెంచుతుంది. భారత్‌పై ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అమెరికా చమురు సంస్థలు లబ్ది పొందడమే కాకుండా భారత్ రష్యా చమురు మీద ఆధారపడకుండా ఉండాలని ఆశిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల యుద్ధం ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెడుతున్నది. తన దారికి రాని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. భారత్ మాత్రం అమెరికా మాట వినాల్సిన అవరసం లేదని భావిస్తుంది. తమ దేశ స్వప్రయోజనాలు ముఖ్యమని భారత్ భావిస్తుంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ ఒక తటస్థ వైఖరిని అవలంబించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచిస్తూనే, తన జాతీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించింది.

ఈ క్రమంలోనే అమెరికా వంటి దేశాలు తరచుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశం ఒక వ్యూహాత్మక భాగస్వామి అని చెబుతూనే, అమెరికా తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం టారిఫ్‌లు, పెనాల్టీలు వంటి హెచ్చరికలను కూడా జారీ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button