Dog: 67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క

Dog: హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల ఆకస్మిక వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. అమాంతంగా వరదలు సంభవించడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో కొందరు ప్రాణాలు కాపాడుకోగా.. ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు 87 మంది చనిపోగా అనేక మంది గాయాలపాలయ్యారు.
ఇదిలా ఉంటే జూన్ 30న అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురవడం మొదలుపెట్టింది. ఒక్క గంటలోనే కుండపోత వర్షం కురిసింది. దీంతో హఠాత్తుగా జలప్రళయం వచ్చినట్లు వరదలు పోటెత్తాయి. కానీ అప్పటికే గ్రామస్తులు గాఢ నిద్రలో ఉన్నారు. బయట ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ సమయంలోనే ఒక కుక్క మొరగడం మొదలు పెట్టింది. యజమానికి మెలుక వచ్చింది కానీ లైట్ తీసుకున్నాడు.
అంతలోనే కుక్క అరవడం మొదలు పెట్టడంతో ఇంటి యజమాని ఏం జరుగుతుందోనని బయటకు వచ్చి చూసేసరికి వరద ముంచుకొస్తున్నట్లు కనిపించింది. వెంటనే అతడు కుక్కను తీసుకుని మిగతా ఇళ్లల్లో ఉన్న వారిని నిద్ర లేపాడు. ఇలా ఒక్కొక్కరు సమాచారం అందించుకుని గ్రామస్తులను మేలు కొల్పడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అలా 67 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఒక గుడిలో సురక్షితంగా ఉన్నారు.
మండి జిల్లాలోని ధరంపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామం. నరేంద్ర అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 30న అర్ధరాత్రి సమయంలో రెండవ అంతస్తులో నిద్రిస్తున్నట్లు చెప్పాడు. ఓ వైపు భారీ వర్షం కురుస్తుందని.. అదే సమయంలో కుక్క అకస్మాత్తుగా మొరగడం మొదలుపెట్టిందని అంతలోనే అరవడం ప్రారంభించిందని చెప్పాడు.
అరుపులు విన్నాక నిద్రలోంచి మేల్కొని బయటకు వచ్చానని అంతలోనే ఇంటి గోడలో పెద్ద పగుళ్లు కనిపించాయని.. ఇంతలోనే నీరు లోపలికి వచ్చేయడం ప్రారంభమైందని వెంటనే కుక్కతో పాటు పరిగెత్తి ఇళ్లల్లో ఉన్న వారందని నిద్ర లేపినట్లు చెప్పాడు. అలా 12 కుటుంబాల్లో ఉన్న 67 మంది ప్రాణాలతో బయటపడినట్లు నాటి విషయాలను నరేంద్ర గుర్తుచేశాడు. కుక్క కారణంగా బ్రతికి బయటపడ్డామని లేదంటే చనిపోయేమని వాపోయాడు.
ఇదిలా ఉంటే కొద్దిసేపటికే గ్రామం కొండచరియలు విరిగిపడడంతో డజన్ల కొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ప్రస్తుతం నాలుగు, ఐదు ఇళ్లు మాత్రమే ఉన్నాయి. మిగతా ఇళ్లులు కొండచరియలు కింద నలిగిపోయాయి. ఇక ప్రాణాలతో బయటపడిన వారు ఏడు రోజులుగా త్రియంబాల గ్రామంలో నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సమీప గ్రామస్తులు సహాయం అందిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 10వేల సాయం అందించింది.