Ram Gopal Varma: సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ముగిసిన విచారణ

Ram Gopal Varma: సినీ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసు విచారణ ముగిసింది. ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవీని సుమారు 11గంటల పాటు విచారించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల మార్ఫింగ్ ఫోటోలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు వర్మ. దీంతో మద్దిపాడు టీడీపీ నాయకుడు రామలింగం ఫిర్యాదుతో ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు అయింది.
ఒంగోలు తాలూకా పిఎస్ లో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హాజరైన ఆర్జీవి, మరోసారి 12వ తేదీన విచారణకు వచ్చారు. రాత్రి 10 గంటల వరకు వర్మను పోలీసులు విచారించారు. మార్ఫింగ్ ఫోటోలు పోస్టింగ్ చేయడం వెనుక ఎవరు ఉన్నారని ఆరా తీసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ నుండి రెండు కోట్ల వరకు ఆర్జీవీకి చెల్లించింది. దీని గురించి పోలీసులు లోతుగా ప్రశ్నించారు. అయితే ఆర్జీవి పోలీసుల విచారణకు సహకరించనట్టు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను అనే సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.



