Deepthi Jeevanji: తెలంగాణ ముద్దుబిడ్డ జీవాంజి దీప్తికి అర్జున అవార్డు
Deepthi Jeevanji: భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. చెస్ విభాగంలో గుకేశ్, హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను బాకర్‌ను ఈ అవార్డులు వరించాయి. అలాగే, 32మందికి అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారని కేంద్రం వెల్లడించింది.
భారత స్వాతంత్ర్యం వచ్చాక.. ఒకే ఒలింపిక్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మను బాకర్ ఘనత సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యాలను సొంతం చేసుకుంది. తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో పేరు ఉండటంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్‌కు ఖేల్ రత్న అవార్డు వరించింది. ఫైనల్లో చైనా ప్లేయర్‌పై అద్భుత విజయంతో ఛాంపియన్‌గా నిలిచాడు. ఒలింపిక్స్‌లో వరుసగా భారత్ రెండో పతకం సాధించడంలో హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. పారాలింపిక్స్‌లో ప్రవీణ్ కుమార్ హై జంప్ T64 విభాగంలో బంగారు పతకం సాధించాడు.
తెలంగాణకు చెందిన పారా అధ్లెట్ దీప్తి జివాంజి అర్జున అవార్డ్ వరించింది. దీప్తితో పాటు మరో తెలుగు యువతి అర్జున అవార్డుకు ఎంపిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన అధ్లెట్ జ్యోతి యర్రాజి కూడా అర్జున అవార్డ్‌కు సెలెక్ట్ అయ్యింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్ వేదికగా జరుగిన పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్స్‌లో 55.82 సెకన్లలో రేస్‌ని కంప్లీట్ చేసి తెలంగాణ యువతి కాంస్య పతకం కొల్లగొట్టింది. తద్వారా పారాలింపిక్స్‌లో ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్‌కు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన అథ్లెట్‌గా దీప్తి దీప్తి జివాంజి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ముందు జపాన్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోను 400ల మీటర్ల రేస్‌ను 55.07 సెకన్లలో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది.
హైదరాబాద్‌లో మెరుగులు దిద్దుకున్న దీప్తి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. పారిస్ పారాలింపిక్స్‌లో మెడల్ గెలవడం ద్వారా దీప్తి పేరు తెలంగాణతో పాటు యావత్ దేశవ్యాప్తంగా మోరు మోగిపోయింది. ఈ నేపథ్యంలోనే విశ్వ క్రీడల్లో పతకం సాధించి దేశ జెండాను ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన దీప్తిని కేంద్రం అర్జున అవార్డుతో సత్కరించింది.