హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో సైబర్ మోసం

Cyber fraud: ఓ సైబర్ నేరగాడు ఐపీఎస్ అధికారి సీవీ సజ్జనార్ పేరుతో ఫేస్‌బుక్‌లో మోసానికి పాల్పడ్డాడు. సజ్జనార్ స్నేహితుడి నుంచి కేటుగాడు డబ్బు కాజేశాడు. ఈ సంఘటనపై సజ్జనార్ స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టు పెట్టారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి.
సైబర్ నేరగాళ్లు కూలీ పనులు చేసుకునే వారినే కాదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారిని కూడా ఈజీగా బురిడీకొట్టిస్తున్నారు. లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో సెలెబ్రిటీల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలు చేయటం బాగా పెరిగింది.
తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తెలిపారు. ఆపదలో ఉన్నానని డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి 20 వేలు పంపి మోసపోయారని చెప్పారు.
డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్‌లైన్ లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.



